India: అభిమానులకు గుండెకోత... సెమీఫైనల్లో టీమిండియా పరాజయం

  • ఫైనల్లోకి దూసుకెళ్లిన న్యూజిలాండ్
  • 18 రన్స్ తేడాతో విజయం
  • 221 పరుగులకు ఆలౌటైన భారత్

అందరూ ఊహించినదే జరిగితే అది క్రికెట్ ఎందుకు అవుతుంది? టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ లో జరిగిన వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ అందుకు నిదర్శనంలా నిలిచింది. ఎంతో కష్టపడి న్యూజిలాండ్ ను 239 పరుగులకు కట్టడి చేసిన టీమిండియా తాను సైతం పిచ్ పరిస్థితులకు బలైంది.

కివీస్ బౌలర్లు పిచ్ ను సద్వినియోగం చేసుకుని రెచ్చిపోయిన వేళ 240 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. భారత ఆటగాళ్లు ఎంతో సునాయాసంగా ఫైనల్ చేరతారనుకుంటే అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చారు. 18 పరుగుల తేడాతో భారత్ ను ఓడించిన కివీస్ ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రేపు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సెమీస్ విజేతతో జూలై 14న జరిగే టైటిల్ పోరులో తలపడనున్నారు.

అంతకుముందు భారత్... జడేజా, ధోనీ క్రీజులో ఉన్నంతసేపు గెలిచేలా కనిపించింది. జడేజా 77 పరుగులు సాధించి అవుటైన తర్వాత, ధోనీ బ్యాట్ ఝుళిపిస్తాడని, జట్టును గెలిపిస్తాడని అందరూ ఆశించారు. వారి అంచనాలకు తగ్గట్టే ఓ భారీ సిక్స్ తో తన ధాటి మొదలుపెట్టిన ధోనీ ఆ తర్వాత దురదృష్టం వెంటాడడంతో రనౌట్ గా వెనుదిరిగాడు.

ఇక, చాహల్, బుమ్రా జోడీ చివరి ఓవర్ ను కాచుకోగా, అప్పటికి భారత్ విజయానికి 6 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి ఉంది. కానీ చాహల్ అవుట్ కావడంతో ఇన్నింగ్స్ కు తెరపడింది. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీకి 3, బౌల్ట్, శాంట్నర్ లకు చెరో 2 వికెట్లు లభించాయి. ఆదిలోనే భారత్ ఇన్నింగ్స్ ను దారుణంగా దెబ్బతీసిన పేసర్ మాట్ హెన్రీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.

More Telugu News