Supreme Court: ఇళ్ల కొనుగోలుదారులకు రక్షణగా నిలబడండి: కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన

  • జేపీ ఇన్ ఫ్రా కస్టమర్ల పిటిషన్ పై విచారణ
  • లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారన్న ధర్మాసనం
  • కేంద్రం చొరవచూపి, నూతన విధానం తేవాలని సూచన

సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలన్న కోరికతో, లక్షలు వెచ్చించి, నిర్మాణ రంగ సంస్థల వైఖరి కారణంగా మోసపోతున్న వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. యునిటెక్ వంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు, మధ్యలోనే నిలిపివేసిన ప్రాజెక్టులను ఇతర బిల్డర్లకు ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకోవాలని గతంలోనే ఆదేశించిన ధర్మాసనం, ఇప్పుడు మిగతా ప్రాజెక్టులను సమీక్షించాలని, కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణకు విధి విధానాలు రూపొందించాలని సూచించింది. జేపీ ఇన్ ఫ్రా టెక్ లిమిటెడ్ సంస్థ తమను మోసం చేసిందంటూ దాఖలైన పిటిషన్ పై విచారించిన జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరిల ధర్మాసనం ఈ మేరకు కేంద్రానికి సూచనలు చేసింది.

నిర్మాణ రంగ సంస్థలు అనుకున్న సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేయని కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని, డబ్బు కట్టి కూడా వారి సొంతింటి కల నెరవేరడం లేదని ఈ సందర్భంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. "సమస్యను పరిష్కరించేందుకు మీరు చొరవచూపాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి మేము సలహాలు కోరుతున్నాం. ఇటువంటి అన్ని కేసుల్లోనూ ఒకే విధానం ఉండాలి" అని ఈ సందర్భంగా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. నిర్మాణ సంస్థ దివాలా తీసినట్టు ప్రకటించినా, గృహ కొనుగోలుదారులకు అన్యాయం జరుగకుండా నిబంధనలు ఉండాలని ధర్మాసనం సూచించింది.

More Telugu News