Tamil Nadu: కోర్టు అంటే నవ్వులాటగా ఉందా?... యువతిపై న్యాయమూర్తి ఆగ్రహం

  • ఆత్మహత్యా యత్నం చేసి తోటి ఉద్యోగులపై ఫిర్యాదు
  • నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ వాంగ్మూలం
  • తర్వాత నిందితులపై చర్యలు తీసుకోవద్దని కోరిన యువతి 

తోటి ఉద్యోగులు తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, మనస్తాపంతో చనిపోతున్నానంటూ ఓ వీడియో సందేశాన్ని వాట్సాప్‌లో పోస్టు చేయడమేకాక, ఆత్మహత్యా యత్నం చేసిన యువతి చివరికి ఎదురు తిరగడంతో న్యాయమూర్తి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యవహరించిన తీరును తప్పుపడుతూ మందలించారు.

ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు వివరాల్లోకి వెళితే...తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లా కారైక్కుడి ముత్తుపట్నం ప్రాంతానికి చెందిన కార్తీక (25) గత నెలలో విషం తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. సహచరులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా కోలుకుంది. తాను పనిచేస్తున్న దుకాణంలోని తోటి ఉద్యోగులు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని, కలత చెందే తానీ నిర్ణయం తీసుకున్నానంటూ ఓ వీడియో చిత్రీకరించి వాట్సాప్‌లో ఉంచింది. దీంతో జిల్లా హక్కుల న్యాయస్థానం న్యాయమూర్తి బాలమురుగన్‌ స్వయంగా కేసు విచారణకు ముందుకు వచ్చారు.

బాధితురాలు కార్తీకను న్యాయస్థానం ముందు హాజరు పరచాలని ఆదేశించారు.  కేసు విచారణ సందర్భంగా నిందితులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని న్యాయమూర్తి గుర్తించారు. అదే విషయమై పోలీసులను ప్రశ్నించారు. అయితే చర్యలు తీసుకోవద్దని సదరు యువతే తమను కోరిందని పోలీసులు చెప్పడంతో న్యాయమూర్తి అవాక్కయ్యారు. విషయం తెలుసుకుని కార్తీకను మందలించడమేకాక పలు కారణాలతో ఆత్మహత్యా యత్నం చేసి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి వారం రోజులు కౌన్సెలింగ్‌ సేవలు అందించాలని ఆదేశించారు.

More Telugu News