Karnataka: కర్ణాటక సంక్షోభం: ముంబై హోటల్ వద్ద హైడ్రామా.. డీకేను అడ్డుకున్న పోలీసులు

  • ఎమ్మెల్యే శివలింగ గౌడతో కలిసి హోటల్‌కు చేరుకున్న డీకే
  • లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
  • హోటల్‌లో తానో గదిని బుక్ చేశానన్నా వినిపించుకోని పోలీసులు

కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ముంబైకి షిఫ్ట్ అయిన కన్నడ రాజకీయం అక్కడ హైడ్రామాకు తెరతీసింది. నగరంలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఉన్న పదిమంది రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ను హోటల్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

హోటల్‌లో తాను ఓ రూమును రిజర్వు చేసుకున్నానని, తనను వెళ్లనివ్వాలని కోరినా పోలీసులు అందుకు అనుమతించలేదు. హోటల్ రిజర్వేషన్‌కు సంబంధించిన వివరాలను పోలీసులకు, మీడియాకు ఆయన చూపించారు. తాను ఎవరికీ హాని తలపెట్టాలనుకోవడం లేదని, తమ ప్రభుత్వంపై తనకు బోల్డంత అభిమానం ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను కలిసి కాఫీ తాగాలని మాత్రమే అనుకుంటున్నానని, అంతేతప్ప మరేమీ లేదన్నారు.

‘‘రెనైసెన్స్ హోటల్‌లో నేనో గదిని బుక్ చేశాను. నా స్నేహితులు హోటల్‌లో ఉన్నారు. మా మధ్య చిన్న సమస్య ఉంది. మేం చర్చలు జరుపుతాం. ఇప్పటికిప్పుడు విడాకులు ఇచ్చుకోవాలనుకోవడం లేదు. మాకు ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది. బెదిరింపుల ప్రసక్తే లేదు’’ అని డీకే చెప్పుకొచ్చారు.

శివకుమార్‌తో కలిసి హోటల్‌కు చేరుకున్న ఎమ్మెల్యే శివలింగ గౌడ మాట్లాడుతూ.. తాము ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేస్తే పోలీసులు అప్పుడు తమను అడ్డుకోవాలని, కానీ ఇప్పుడు ఇలా చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్‌లోకి వెళ్లే అధికారం తమకు ఉందన్నారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ నిర్బంధించిందని, వారిని తాము కలవాలనుకుంటున్నామని అన్నారు. తాజా పరిణామాలపై బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప మాట్లాడుతూ విధాన సౌధ ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. స్పీకర్‌ను, గవర్నర్‌ను కలుస్తామన్నారు.  

More Telugu News