TRS: నాపై ఎంపీ కోమటిరెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవాలు: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

  • భూ కబ్జా ఆరోపణలను నిరూపించాలి
  • ఈ ఆరోపణలు నిజమైతే నా పదవికి రాజీనామా చేస్తా
  • లేనిపక్షంలో కోమటిరెడ్డి రాజీనామా చేయాలి 

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనపై చేసిన భూ కబ్జా ఆరోపణలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఖండించారు. ఈ ఆరోపణలను నిరూపిస్తే కనుక తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని, లేనిపక్షంలో ఎంపీ పదవికి కోమటిరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తనపై ఈ ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి క్షమాపణలు చెప్పని పక్షంలో కోర్టులో పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ వ్యవహారంలోకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను లాగడం మంచిది కాదని, ఆయన ‘నిప్పురవ్వ’ అని అభివర్ణించారు.

ఓబీసీ నేత ఎదగడాన్ని చూసి కోమటిరెడ్డి ఓర్చుకోలేకపోతున్నారని, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే  తన గ్రామంలో ఇల్లు నిర్మించుకుంటున్నానని చెప్పారు. తన లాంటి బలహీన వర్గాల వ్యక్తి 120 గజాల్లో రెండు గదులు కట్టుకోకూడదా? కోమటిరెడ్డికే భారీ ఇల్లు కట్టుకునే హక్కు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. తనకు ఇరవై ఒక్క ఏళ్లు ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చానని, తనకు డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉంటే అప్పుడే అధికార పార్టీ ‘కాంగ్రెస్’లోకి వెళ్లే వాడినని అన్నారు. తాను ఎక్కడైనా ప్రభుత్వ భూమిని గజమైనా ఆక్రమించుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని ఆయన సవాల్ విసిరారు.    

More Telugu News