Tamilnadu: నీటి ఆదాకు చెన్నై యువ ఇంజనీర్ల పరిష్కారం.. 95 శాతం నీటిని ఆదాచేసేలా నాజిల్స్ అభివృద్ధి!

  • నీళ్లకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న చెన్నై వాసులు
  • 2020 నాటికి భూగర్భ జలాలే ఉండవంటున్న నిపుణులు
  • నీటిని ఆదా చేసేందుకు ముందుకొచ్చిన యువ ఇంజనీర్లు

తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రజలు తాగునీటికి అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నప్పటికీ సరిపోవడం లేదు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే చివరికి నీటి సరఫరా లేక చెన్నైలో హోటళ్లు సైతం మూతపడుతున్నాయి. దీనికితోడు 2020 నాటికి చెన్నైలో భూగర్భ జలాలు అనేవే ఉండవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీటిని ఆదా చేయడానికి తమిళనాడుకు చెందిన యువ ఇంజనీర్లు ముందుకొచ్చారు. నీటి వాడకం సందర్భంగా 95 శాతం నీటిని ఆదా చేసేలా ప్రత్యేకమైన నాజిల్స్ ను అభివృద్ధి చేశారు.

ఈ విషయమై ఇంజనీర్లు స్పందిస్తూ.. సాధారణంగా చేతులు కడిగేటప్పుడు మనం నిమిషానికి 600 మిల్లీలీటర్ల నీటిని వాడుతాం. కానీ మా నాజిల్స్ ను అమర్చుకుంటే 10-20 మిల్లీలీటర్ల నీరు మాత్రమే ఖర్చవుతుంది’ అని తెలిపారు. ఈ నాజిల్స్ ను ఇంట్లోని కుళాయిలకు బిగించుకుంటే రోజుకు 35 లీటర్ల నీటిని ఆదా చేయవచ్చని వెల్లడించారు.

ఈ నాజిల్స్ నీటి ధారను బాగా తగ్గించడం వల్ల మనం వాడే నీటిలో 95 శాతం వరకూ ఆదా చేయవచ్చని పేర్కొన్నారు. అన్నట్లు ‘ఎర్త్ ఫోకస్’ అనే కంపెనీ పేరుతో అమ్ముతున్న ఈ నాజిల్స్ కు డిమాండ్ కూడా భారీగా ఉంది. మార్కెట్ కి వచ్చిన కొన్ని రోజులకే చెన్నైలో దాదాపు 7,000 నాజిల్స్ అమ్ముడుపోయాయి.

More Telugu News