Andhra Pradesh: అమరావతిలో దొంగలు పడ్డారు.. ఇసుక, స్టీలు కొట్టేశారు.. సామాన్లన్నీ పట్టుకెళ్లిపోతున్నారు!: నారా లోకేశ్

  • రూ.200 ఉన్న పెన్షన్ ను చంద్రబాబు రూ.2 వేలు చేశారు
  • అయితే రూ.వెయ్యి నుంచి రూ.2,250 పెంచినట్లు వైసీపీ ప్రచారం చేసుకుంటోంది
  • ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చారు.. అంతా మునిగిపోయింది

వైఎస్ హయాంలో రూ.200గా ఉన్న పెన్షన్ ను చంద్రబాబు రూ.1000కి పెంచారనీ, దాన్ని రూ.2 వేలకు తీసుకెళ్లారని టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం పెన్షన్ ను రూ.వెయ్యి నుంచి రూ.2,250కి పెంచినట్లు అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. ‘ఎవరి చెవిలో పువ్వు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారయ్యా మీరు? ఇది ఎంత అన్యాయం? రూ.250 మేర పెన్షన్ పెంచామని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అందుకే రూ.వెయ్యి నుంచి రూ.2,250 పెంచామని అబద్ధాలు చెబుతోంది’ అని దుయ్యబట్టారు. కృష్ణా జిల్లాలోని నూజివీడు సీతారామపురం వద్ద కృష్ణా నదికి టీడీపీ నేతలు నారా లోకేశ్, దేవినేని ఉమ, వల్లభనేని వంశీ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయాయి. ఇప్పుడు క్రికెట్ సీజన్ నడుస్తోంది. ప్రజలంతా టీవీల దగ్గర ఉంటారు. ఏపీలో ఇప్పుడు అభివృద్ధి పనులన్నీ క్రికెట్ వికెట్లు పడినట్లు ఆగిపోతున్నాయి. పోలవరం పనులు జరగడం లేదు. అమరావతిలో పనులు ఆగిపోయాయి.

అమరావతిలో ఇప్పుడు దొంగలు పడ్డారు. ఇసుక కొట్టేశారు. స్టీలు కొట్టేశారు. సామాన్లన్నీ పట్టుకెళ్లి పోతున్నారు. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి.. ఇవ్వండో.. ఇవ్వండి.. ఇవ్వండి.. ఇవ్వండి అని చెప్పడంతో ఈ ప్రభుత్వం వచ్చింది. ఒక్క అవకాశం ఇచ్చినందుకు అంతా మునిగిపోయింది’ అని దుయ్యబట్టారు. చివరికి గవర్నర్ ప్రసంగంలో అమరావతి అనే పదమే లేదని విమర్శించారు.

More Telugu News