Srikakulam District: అచ్చెన్నాయుడు ఎన్నికల కమిషన్‌ను తప్పుదోవ పట్టించారు: హైకోర్టులో వైసీపీ నేత పిటిషన్

  • క్రిమినల్ కేసులను దాచిపెట్టారు
  • ఆయన ఎన్నికను రద్దు చేయండి
  • నన్ను ఎమ్మెల్యేగా ప్రకటించండి

టీడీపీ నేత, టెక్కలి ఎమ్మెల్యే  కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికల కమిషన్‌‌ను తప్పుదోవ పట్టించారని, ఆయన ఎన్నిక చెల్లదని ఆరోపిస్తూ వైసీపీ నేత పేరాడ తిలక్ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో అచ్చెన్నాయుడు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో పలు వివరాలను దాచిపెట్టారన్నారు. ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులను అఫిడవిట్‌లో ప్రస్తావించలేదని ఆరోపించారు.

ఓబుళాపురం మైనింగ్ వద్ద 21 జూలై 2007లో దౌర్జన్యం కేసులో అచ్చెన్నాయుడితోపాటు 20మందిపై కేసులు నమోదయ్యాయని పేరాడ తెలిపారు. ఆ ఘటనలో పలు సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదయ్యాయన్నారు. అలాగే, రాయిదుర్గం కోర్టు కేసులో అచ్చెన్నాయుడు 21వ ముద్దాయిగా ఉన్నారని, కోర్టుకు హాజరుకానందుకు ఆయనపై అరెస్ట్ వారెంటు కూడా ఉందని వివరించారు.

ఈ విషయాలేవీ ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనకుండా ఈసీని తప్పుదోవ పట్టించారన్నారు. కాబట్టి ఆయన ఎన్నికను రద్దు చేసి ఆయన తర్వాతి స్థానంలో నిలిచిన తనను ఎమ్మెల్యేగా కొనసాగించాలని కోర్టును అభ్యర్థించారు. అచ్చెన్నపై అరెస్ట్ వారెంట్ పెండింగ్‌లో ఉన్నందున ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

More Telugu News