న్యూజిలాండ్ బలం ఏంటో మాకు తెలుసు: టీమిండియా బ్యాటింగ్ కోచ్

08-07-2019 Mon 19:00
  • కివీస్ ఆటగాళ్లపై అవగాహన ఉంది
  • భారత మిడిలార్డర్ పై చింతలేదు
  • ఎవరి కర్తవ్యం వాళ్లు నిర్వర్తిస్తున్నారు
ఒక్క మిడిలార్డర్ రాణించకపోవడం తప్ప ఈ వరల్డ్ కప్ లో టీమిండియాలో ఎన్నదగిన లోపమంటూ లేదు. అయితే, సెమీఫైనల్లో తమ బ్యాట్స్ మెన్ ప్రతి ఒక్కరూ రాణిస్తారంటూ టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ధీమా వ్యక్తం చేశాడు. రేపు కివీస్ తో మాంచెస్టర్ లో సెమీఫైనల్ ఆడనున్న నేపథ్యంలో, మిడిలార్డర్ గురించి తమకేమీ చింతలేదని బంగర్ స్పష్టం చేశాడు. సెమీస్ ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు శక్తిసామర్థ్యాలేంటో తమకు తెలుసని అన్నాడు.

న్యూజిలాండ్ తో లీగ్ మ్యాచ్ వర్షార్పణం కాగా, ఆ జట్టుతో సెమీస్ లో తలపడనుండడం ఏమైనా ఇబ్బందికరమా అన్న ప్రశ్నకు బదులిస్తూ, న్యూజిలాండ్ తో ఓ పూర్తిస్థాయి సిరీస్ ఆడి ఎక్కువ రోజులేం కాలేదని, అందువల్ల ప్రస్తుతం ఆ జట్టులో ఉన్న అందరు ఆటగాళ్లపై తమకు అవగాహన ఉందని బంగర్ స్పష్టం చేశాడు. వాళ్లు ఏ అంశాల్లో సమర్థులో తమకు తెలుసని అన్నాడు. ఇక, టీమిండియా మిడిలార్డర్ పై విమర్శలు రావడం పట్ల స్పందిస్తూ, ఒక్క ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో తప్ప టీమిండియా మిడిలార్డర్ కు ఎక్కువ సమయం ఆడే అవకాశం రాలేదని, అయితే, హార్దిక్ పాండ్య, ధోనీ, రిషభ్ తమవంతు కర్తవ్యం సమర్థంగా నిర్వర్తించారని తెలిపాడు.