India: సెమీఫైనల్లో టీమిండియాను ఎలా కొట్టాలో న్యూజిలాండ్ కు చెబుతున్న వెటోరీ

  • తొలి 10 ఓవర్లే కీలకం
  • బ్యాటింగ్ అయినా, బౌలింగ్ అయినా ఆ పది ఓవర్లలో భారత్ పనిబట్టాలి
  • ఇంగ్లాండ్ అనుసరించిన వ్యూహాన్నే కివీస్ ఫాలో అవ్వాలి

గత కొన్నివారాలుగా ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్ ముగింపు దశకు చేరుకుంది. రేపు టీమిండియా, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ తో టోర్నీలో నాకౌట్ దశ ప్రారంభం కానుంది. భారత్, కివీస్ సెమీస్ మ్యాచ్ కు మాంచెస్టర్ ఆతిథ్యమిస్తోంది. కాగా, టీమిండియా భీకరఫామ్ లో ఉన్న నేపథ్యంలో ఆ జట్టుపై విజయం సాధించాలంటే విధ్వంసకర ఆరంభం అవసరమని మాజీ క్రికెటర్ డానియెల్ వెటోరీ న్యూజిలాండ్ జట్టుకు ఉద్బోధించాడు.

తొలి 10 ఓవర్లలో ఎలా ఆడామన్నదానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని, అది బ్యాట్ తోనైనా, బంతితోనైనా ప్రత్యర్థిని ఆ పది ఓవర్లలోనే దెబ్బకొట్టాలని సూచించాడు. ధాటిగా ఆడి పరుగులు చేసే క్రమంలో కివీస్ కు ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఎంతో కీలకం అని, గతంలో అతను ఎన్నో భారీ ఇన్నింగ్స్ లు ఆడాడని వెటోరీ పేర్కొన్నాడు. ఎడ్జ్ బాస్టన్ లో టీమిండియాపై ఇంగ్లాండ్ ఎలాంటి ఎత్తుగడలు అనుసరించిందో కివీస్ కూడా ఆ తరహా వ్యూహాలనే సెమీస్ లో అమలుచేయాలని సలహా ఇచ్చాడు.

బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కోలేమని తెలుసుకున్న మోర్గాన్ బృందం ఆ మ్యాచ్ లో మిగిలిన భారత బౌలర్లను టార్గెట్ చేసి భారీగా పరుగులు రాబట్టిందని వెటోరీ వివరించాడు. భారీ స్కోరు నమోదు చేయడానికి అవసరమైన టాలెంట్ కివీస్ జట్టుకు ఉందని, సమష్టిగా ఆడాల్సిన సమయం ఇదేనని ఈ మాజీ సారథి వ్యాఖ్యానించాడు.

ఒకవేళ తొలుత బౌలింగ్ చేయాల్సివస్తే, మొదటి 10 ఓవర్లలో భారత బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేయాలని సూచించాడు. టీమిండియా ఓపెనర్లను స్వల్ప స్కోర్లకే అవుట్ చేస్తే మిడిలార్డర్ ను దెబ్బతీయడం పెద్ద కష్టంకాదని అన్నాడు. ఆ బాధ్యత కొత్త బంతి బౌలర్ ట్రెంట్ బౌల్ట్ పైనే ఉంటుందని వెటోరీ అభిప్రాయపడ్డాడు.

More Telugu News