Pakistan: ఇమ్రాన్.. ప్రధాని పదవికి రాజీనామా చేయ్.. ఇంటికి వెళ్లిపో!: పీఎంఎల్ నేత మర్యమ్ నవాజ్ ఆగ్రహం

  • పాక్ ప్రధానిగా ఉండే అర్హత ఇమ్రాన్ ఖాన్ కు లేదు
  • నా తండ్రి ఆరోగ్యం బాగోలేకపోయినా జైలులో పెట్టారు
  • పంజాబ్ లో ర్యాలీ సందర్భంగా మండిపడ్డ మాజీ ప్రధాని కుమార్తె

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై పాక్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) ఉపాధ్యక్షురాలు మర్యమ్ నవాజ్ తీవ్రంగా మండిపడ్డారు. పాక్ ప్రధానిగా కొనసాగే అర్హత ఇమ్రాన్ ఖాన్ కు ఎంతమాత్రం లేదనీ, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ పంజాబ్ లోని మండి బహౌద్దీన్ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో మర్యమ్ మాట్లాడుతూ..‘నా తండ్రి నవాజ్ షరీఫ్ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆయన్ను జైలులో ఉంచారు. ఇది నేరం. ఆయన త్వరలోనే విడుదల అవుతారు. మళ్లీ ప్రధాని కూడా అవుతారు. అయితే ఈ సారి గతంలో కంటే బలంగా నిలబడతారు.

కొన్ని అదృశ్య హస్తాల ఒత్తిడితోనే నా తండ్రిని దోషిగా నిర్ధారించి జైలులో బంధించారు’ అని మర్యమ్ ఆరోపించారు. ‘ఇమ్రాన్.. ప్రధాని పదవికి వెంటనే రాజీనామా చేయ్. ఇంటికి వెళ్లిపో’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నవాజ్ షరీఫ్ కు గతేడాది ఏడేళ్ల జైలుశిక్ష విధించిన జడ్జి అర్షద్ మాలిక్ మాట్లాడుతున్న ఓ రహస్య వీడియోను ఆమె విడుదల చేశారు. పైస్థాయిలో తీవ్రమైన ఒత్తిడి కారణంగానే మాలిక్ తన తండ్రికి శిక్ష విధించారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను మాలిక్ ఖండించారు. కేసులోని సాక్ష్యాల ఆధారంగానే నవాజ్ షరీఫ్ కు తాను శిక్ష విధించానని స్పష్టం చేశారు.

More Telugu News