Prahlad Joshi: దేవెగౌడ కుటుంబం నుంచి ఎవరూ సీఎంగా ఉండకూడదని సిద్ధరామయ్యే సంక్షోభం సృష్టించారు: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి

  • సంక్షోభానికి స్క్రిప్టు రచయిత సిద్ధరామయ్యే
  • కాంగ్రెస్ లో పరమేశ్వర ఎదగడం కూడా సిద్ధరామయ్యకు ఇష్టంలేదు
  • ప్రస్తుత పరిస్థితులు సిద్ధరామయ్య చేతులు దాటిపోయాయి

కర్ణాటక రాజకీయ సంక్షోభంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తనదైన శైలిలో స్పందించారు. మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబం నుంచి ఎవరూ ముఖ్యమంత్రిగా ఉండకూడదన్న ఉద్దేశంతోనే మాజీ సీఎం సిద్ధరామయ్య కల్లోలానికి ప్రణాళికలు రచించాడని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వ ప్రస్తుత పరిస్థితికి సిద్ధరామయ్యే కారకుడని, సంక్షోభానికి స్క్రిప్టు రాసింది ఆయనేనని జోషి వ్యాఖ్యానించారు.

అంతేగాకుండా, కాంగ్రెస్ పార్టీలో మరో నేత పరమేశ్వర ఎదగడం కూడా సిద్ధరామయ్యకు ఇష్టంలేదని అన్నారు. సంక్షోభానికి కారకుడు సిద్ధరామయ్యే అయినా, పరిస్థితులు ఆయన చేతులు కూడా దాటిపోయాయని అభిప్రాయపడ్డారు. ముంబయిలో మకాం వేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు కర్ణాటక వెళ్లేది లేదని, తిరిగి కూటమిలో చేరేది లేదని కరాఖండీగా చెబుతున్నారని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. అయితే సిద్ధరామయ్య ఈ పరిస్థితికి కారణం బీజేపీనే అంటూ ఆరోపణలు చేయడం సబబు కాదని, సిద్ధరామయ్య స్వార్థబుద్ధి కారణంగానే కర్ణాటక ప్రభుత్వం అనిశ్చితిలో పడిందని తెలిపారు.

More Telugu News