cuddapah: రైతు బాగుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుంది: సీఎం జగన్

  • జమ్మలమడుగులో రైతు దినోత్సవ సభ
  • ప్రతి ఏటా రైతు దినోత్సవం నిర్వహిస్తాం
  • అక్టోబర్ 15 నుంచి వైఎస్ఆర్ భరోసా పథకం అమలు

రైతు బాగుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుందని, అందుకే, రైతుల కోసం వైఎస్ ఆర్ భరోసా పథకం ప్రవేశపెడుతున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన రైతు దినోత్సవ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రతి ఏటా వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్ 15 నుంచి వైఎస్ఆర్ భరోసా పథకం కింద రూ.12,500 ఇస్తామని పేర్కొన్నారు.

వ్యవసాయంలో దశ, దిశ ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామని అన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కింద అవ్వా తాతాలకు రూ.2,250 అమలు చేస్తున్నామని, దివ్యాంగులకు రూ.3 వేల పెన్షన్, డయాలసిస్ పేషెంట్లకు రూ.10 వేల పెన్షన్ మంజూరు చేస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ జిల్లాకు గతంలో కంటే రెట్టింపుగా రూ.70 కోట్లను పెన్షన్ కింద ఇస్తున్నామని, అధికారంలోకి వచ్చిన నెల లోపే కేటాయించామని చెప్పారు. పెన్షన్ రాకుంటే నేరుగా సీఎం కార్యాలయానికే ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక నెంబర్ ఏర్పాటు చేస్తామని అన్నారు.

సెప్టెంబర్ 1 నుంచి నేరుగా సంక్షేమ ఫలాలు ప్రజల ఇంటికే చేరతాయని చెప్పారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ ఇస్తోందని, ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు.

More Telugu News