Andhra Pradesh: వైఎస్ రాజశేఖరరెడ్డి లక్ష్యంగా విమర్శలు గుప్పించిన టీడీపీ నేత నారా లోకేశ్!

  • వైఎస్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుతున్న ఏపీ ప్రభుత్వం
  • వైఎస్ హయాంలో పోలీసుల కాల్పులను ప్రస్తావించిన లోకేశ్
  • ఆయన జయంతినే రైతు దినోత్సవంగా జరుపుతున్నారని ఎద్దేవా

ఈరోజు వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కడప జిల్లా జమ్మలమడుగులో ఈరోజు రైతు దినోత్సవాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. వైఎస్ హయాంలో శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, కాకరాపల్లిలో ధర్మల్ విద్యుత్ ప్లాంట్లకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించడం, ఈ సందర్భంగా పోలీసుల కాల్పులను లోకేశ్ ప్రస్తావించారు.

‘అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల, తూటాలతో రైతులను పిట్టలను కాల్చినట్టు కాల్చినందువల్ల దేశంలో అందరూ ఆ రాజుగారి గురించి మాట్లాడుకున్నారు. కాలం గిర్రున తిరిగింది. ఆ రాజుగారి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుతోంది. కాలమహిమ!’ అని లోకేశ్ వెటకారంగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు అప్పటి వార్తాపత్రికల క్లిప్పులను జతచేశారు.

More Telugu News