Karnataka: కర్ణాటక రాజకీయంలో కొత్త ట్విస్ట్.. రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్ మంత్రులు!

  • పదవిని వదులుకున్న డిప్యూటీ సీఎం పరమేశ్వర
  • తమ పదవులను రెబెల్స్ కు ఇచ్చేందుకు అంగీకారం
  • మరికాసేపట్లో గవర్నర్ ను కలవనున్న సీఎం కుమారస్వామి

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం కుమారస్వామి చివరి అస్త్రాన్ని ప్రయోగించారు. బెంగళూరులోని ఓ ప్రాంతంలో డిప్యూటీ సీఎం పరమేశ్వరతో పాటు ముఖ్య నేతలతో సమావేశమైన కుమారస్వామి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే ప్రస్తుత మంత్రులు రాజీనామాలు చేయడమే శరణ్యమని అంగీకారానికి వచ్చారు. ఈ సందర్భంగా కేపీసీసీ ఇన్ చార్జ్ కేసీ వేణుగోపాల్ తోనూ సీఎం కుమారస్వామి చర్చించారు.

ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వీలుగా డిప్యూటీ సీఎం పరమేశ్వరతో పాటు  హోంమంత్రి ఎంబీ పాటిల్, రెవెన్యూ మంత్రి ఆర్వీ దేశ్ పాండే, మంత్రులు డీకే శివకుమార్, జేకే జార్జ్, యూటీ ఖాదర్, జమీర్ అహ్మద్ ఖాన్ సహా 22 మంది కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చేశారు. అయితే జేడీఎస్ మంత్రులు రాజీనామా చేయడంపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  కాగా, మంత్రుల రాజీనామా లేఖలతో సీఎం కుమారస్వామి మరికాసేపట్లో గవర్నర్ వజూభాయ్ వాలాను కలవనున్నట్లు సమాచారం. 

More Telugu News