Andhra Pradesh: సీఎం జగన్ కు చంద్రబాబు ఇంటిపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై లేదు!: కోడెల శివప్రసాద్

  • ప్రజలు సీఎం జగన్ నుంచి చాలా ఆశించారు
  • నా కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు
  • నిజంగా తప్పు జరిగితే విచారణ జరిపి చర్యలు తీసుకోండి

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నుంచి ప్రజలు చాలా ఆశించారనీ, కానీ వారంతా ఇప్పుడు నిరాశ చెందారని టీడీపీ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. ఎన్నికల సందర్భంగా చెప్పినట్లు జగన్ ఏపీకి ప్రత్యేకహోదా సాధించలేకపోయారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అన్యాయం జరిగినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి నిధులను ఆపేశారని దుయ్యబట్టారు. గుంటూరుజిల్లాలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కోడెల మాట్లాడారు.

‘విద్యుత్ ఒప్పందాలపై సమీక్షలు అనడంతో రాష్ట్రంలో విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి. పట్టిసీమ నుంచి నీటి విడుదల ఆసల్యం కావడంతో ఖరీఫ్ సీజన్ లో పంటల సాగు ఇంకా ప్రారంభం కాలేదు. విత్తనాల పంపిణీపై సరైన ప్రణాళిక లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరికి సీఎం సహాయనిధి, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను కూడా నిలిపివేశారు. భవన నిర్మాణ కార్మికులకు పని దొరక్క రోడ్డుపైకి వస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కంపెనీలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రావడంలేదు. ప్రజావేదికను కూల్చేసి ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. సీఎం జగన్ కు చంద్రబాబు ఇంటిపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదు. ఆయన చెప్పినదానికి, చేస్తున్నదానికి పొంతన లేదు. నాపై, నా కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిజంగా తప్పు జరిగిఉంటే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News