Kolkata: చనిపోయిన వృద్ధురాలిని ఇంట్లో పెట్టుకుని జీవిస్తున్న కుటుంబం.. గతంలోనూ ఇదే తీరు!

  • రెండు రోజుల క్రితం చనిపోయిన మహిళ
  • మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకుని దైనందిన కార్యక్రమాలు
  • దుర్వాసన వస్తుండడంతో పక్కింటి వ్యక్తుల ఫిర్యాదు

రెండు రోజుల క్రితం చనిపోయిన వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహంచకుండా ఇంట్లోనే పెట్టుకుని దైనందిన కార్యక్రమాలు నిర్వహిస్తోందో కుటుంబం. పొరుగింటి వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగు చూసింది.

కోల్‌కతాలోని బెహలాలో జరిగిందీ ఘటన. అయితే, ఆ కుటుంబానికి ఇది కొత్తకాదని తేలింది. ఐదు నెలల క్రితం కూడా ఆ కుటుంబం ఇలానే చేసిందని పోలీసులు తెలిపారు. వృద్ధురాలి కుమారుడు చనిపోతే కూడా మూడు రోజులు ఇంట్లోనే అట్టే పెట్టుకున్నారని పేర్కొన్నారు.
 
82 ఏళ్ల ఛాయా చటర్జీ రెండు రోజుల క్రితం ఆమె గదిలో కిందపడి ప్రాణాలు కోల్పోయింది. మంచానికే పరిమితమైన ఆమె భర్త రవీంద్రనాథ్, కుమార్తె నీలంజనలు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించకుండా అలానే వదిలేసి రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అయితే, పక్కింటి నుంచి దుర్వాసన వస్తోందంటూ పొరిగింటి వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఛాయా చటర్జీ మృతి విషయం బయటపడింది. ఆమె రెండు రోజుల క్రితమే మరణించిందని నీలంజన పోలీసులకు తెలిపింది.

కాగా, ఫిబ్రవరిలోనూ అదే ఇంట్లో ఇటువంటి ఘటనే ఒకటి జరిగిందని పోలీసులు తెలిపారు. వృద్ధ దంపతుల కుమారుడు దేవాశిష్ చటర్జీ (47) చనిపోయినప్పుడు కూడా వారు ఇలానే చేశారని, మూడు రోజలపాటు ఇంట్లోనే ఉంచుకున్నారని పోలీసులు వివరించారు. అప్పుడు కూడా ఇంటి నుంచి భరించలేని దుర్వాసన వస్తుండడంతో పొరిగింటి వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారేదో మానసిక వ్యాధితో బాధపడుతుండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఇరుగుపొరుగు వారితో మాట్లాడరని, ముభావంగా ఉంటారని పేర్కొన్నారు. కాగా, తాజా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News