TSPEA: ఆంధ్రా ఉద్యోగులు వద్దంటే వద్దు...వారిని తీసుకుంటే ఉద్యమమే: తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌

  • ఆంధ్ర నేపథ్యం ఉన్న ఉద్యోగులను ఎప్పుడో రిలీవ్‌ చేశారు
  • వారిని అక్కడి విద్యుత్‌ సంస్థలు తీసుకోకుంటే తప్పెవరిది
  • అలాగని వారిని తిరిగి తీసుకుంటే ఊరుకునేది లేదన్న టీఎస్‌పీఈఏ

ఆంధ్రా విద్యుత్‌ సంస్థల మొండివైఖరికి తలొగ్గి తెలంగాణ నుంచి రిలీవ్‌ చేసిన ఆంధ్ర ఉద్యోగులను తిరిగి తీసుకుంటే ఉద్యమించాల్సి వస్తుందని తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్‌పీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు రత్నాకర్‌ రావు హెచ్చరించారు. నిన్న కరీంనగర్‌లోని టీఎస్‌పీఈఏ అతిథిగృహంలో జరిగిన రాష్ట్ర సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.

విభజన సందర్భంగా సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేందుకు 612 మంది ఆప్షన్‌లు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే ఇతరత్రా కారణాలున్న మరికొందరితో కలిపి మొత్తం 1157 మంది ఆంధ్ర నేపథ్యం ఉన్న ఉద్యోగులను తెలంగాణ విద్యుత్‌ సంస్థల నుంచి రిలీవ్‌ చేశారన్నారు. తీరా రిలీవ్‌ అయ్యాక అక్కడి విద్యుత్‌ సంస్థలు చేర్చుకోకపోవడంతో మళ్లీ తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో సర్దుబాటు చేయాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అవసరమైతే ఉద్యమానికి తెలంగాణ విద్యుత్‌ సంస్థ ఇంజనీర్లు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తక్షణం పెండింగ్‌లోని పదోన్నతుల అంశాన్ని పరిష్కరించాలని, సంస్థను ప్రైవేటీకరించాలన్న కేంద్ర నిర్ణయానికి తలవంచవద్దని కోరారు.

More Telugu News