India: ఈ వరల్డ్ కప్ లో ఒక్కసారి కూడా తలపడని టీమిండియా, న్యూజిలాండ్

  • జూన్ 13 మ్యాచ్ వర్షార్పణం
  • వార్మప్ మ్యాచ్ లో కూడా తలపడని ఇరుజట్లు
  • మాంచెస్టర్ మ్యాచ్ లో గెలుపు కోసం తహతహ

ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో మరో మూడు మ్యాచ్ లు మాత్రమే మిగిలాయి. నిన్నటితో సుదీర్ఘమైన లీగ్ దశ ముగియగా, ఎల్లుండి నుంచి సెమీఫైనల్స్ జరగనున్నాయి. జూలై 9న టీమిండియా, న్యూజిలాండ్.... జూలై 11న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సెమీస్ మ్యాచ్ ల్లో తలపడనున్నాయి. జూలై 14న లార్డ్స్ మైదానంలో ఫైనల్ సమరం జరగనుంది. లీగ్ దశ ప్రదర్శన ఆధారంగా పాయింట్ల పట్టికలో టీమిండియాకు అగ్రస్థానం లభించగా, నాలుగోస్థానంలో ఉన్న న్యూజిలాండ్ తో సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, లీగ్ దశలో ఆడిన 10 జట్లు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉండగా, భారత్, న్యూజిలాండ్ జట్లు లీగ్ దశలోనే కాదు కదా కనీసం ప్రాక్టీసు మ్యాచ్ లో కూడా ముఖాముఖీ తలపడలేదు.  టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జూన్ 13న నాటింగ్ హామ్ లో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. అంతకుముందు, వార్మప్ మ్యాచ్ ల్లో కూడా ఈ రెండు జట్లు పరస్పరం ఆడింది లేదు. దాంతో, బలాబలాల విషయంలో రెండు జట్లు ఆచితూచి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా సూపర్ ఫామ్ లో ఉండగా, కోహ్లీ, హార్దిక్ పాండ్య విలువైన పరుగులు జోడిస్తున్నారు. బౌలింగ్ లో షమీ గురించి ఎంత చెప్పినా తక్కువే. షమీకి బుమ్రా, చాహల్ తోడైతే ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ కు కష్టాలు తప్పవని లీగ్ దశలో రుజువైంది. కానీ, కివీస్ జట్టుకు అనేక ప్రతికూలతలు ఉన్నాయి. కెప్టెన్ కేన్ విలియమ్సన్ తప్ప నిలకడగా ఆడే ఆటగాళ్లే కరవయ్యారు.

ఆల్ రౌండర్లపై అతిగా ఆధారపడే జట్టుగా పేరున్న న్యూజిలాండ్ ఈసారి కూడా వాళ్లే దిక్కయ్యారు. కొలిన్ గ్రాండ్ హోమ్, జిమ్మీ నీషామ్ ల ప్రదర్శనపైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. బౌలింగ్ లో ట్రెంట్ బౌల్ట్ తేలిపోతుండగా, టిమ్ సౌథీలో గత వైభవం కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో ఆ జట్టు ఆశలన్నీ ఎక్స్ ప్రెస్ బౌలర్ లాకీ ఫెర్గుసన్ పైనే ఉన్నాయి. ఏదేమైనా, మాంచెస్టర్ లో జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో సత్తాచాటి టైటిల్ పోరుకు అర్హత సాధించాలని ఇరుజట్లు ఉరకలు వేస్తున్నాయి.

More Telugu News