Business: వ్యాపారి రాం ప్రసాద్ హత్యతో నాకు సంబంధం లేదు: కోగంటి సత్యం

  • రాంప్రసాద్ ను చంపాలంటే నాకు ఒక్క నిమిషం పని
  • రాజకీయ దురుద్దేశంతోనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు
  • నాపై 19 కేసులు ఉన్నాయన్నది దుష్ప్రచారం

కృష్ణా జిల్లాకు చెంది ఐరన్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ నిన్న హైదరాబాద్ లో దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యతో విజయవాడకు చెందిన రాజకీయనాయకుడు, పారిశ్రామికవేత్త, రౌడీషీటర్ కోగంటి సత్యంకు సంబంధం ఉందని రాంప్రసాద్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కోగంటి సత్యంను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ హత్యతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 2013లో రాంప్రసాద్ కంపెనీకి స్క్రాప్ సప్లై చేసిన కొన్ని వందల మందికి, తనకు కలిపి సుమారు రూ.70 కోట్లు ఎగ్గొట్టి పారిపోయాడని, ఇందులో తనకే రూ.25 కోట్లు రావాల్సి ఉందని అన్నారు. ఆయన్ని హత్య చేయిస్తే తనకు రావాల్సిన డబ్బు తనకు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ‘రాంప్రసాద్ ను చంపాలంటే నాకు ఒక్క నిమిషం పని, విజయవాడలోనే చంపేవాళ్లు’ అని వ్యాఖ్యానించారు. రాంప్రసాద్ ను చివరిసారిగా ఇరవై రోజుల కిందట ఓ ఫంక్షన్ లో కలిశానని, ‘నా డబ్బు ఎప్పుడిస్తావు?’ అని ఆయన్ని అడిగానని, ‘రాంప్రసాద్ ను హత్య చేస్తే నా డబ్బులు తిరిగిరావుగా’ అని అన్నారు.

రాజకీయ దురుద్దేశంతోనే టీడీపీ వాళ్లు తనపై ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై 19 కేసులు ఉన్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతోందని, అది కరెక్టు కాదని, మూడు కేసులు మాత్రమే ఉన్నాయని కోగంటి స్పష్టం చేశారు.

More Telugu News