Nawaz Sharif: నవాజ్ షరీఫ్ ను జైలుకు పంపడం వెనుక భారీ కుట్ర.. పాకిస్థాన్ లో కలకలం రేపుతున్న వీడియో

  • జడ్జి మాట్లాడుతున్న వీడియోను బయటపెట్టిన షరీఫ్ కుమార్తె
  • షరీఫ్ ను బలవంతంగా ప్రకటించాల్సి వచ్చిందని చెబుతున్న జడ్జి
  • బ్లాక్ మెయిల్ చేసి జడ్జితో తీర్పును రాయించారన్న మర్యం

అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను దోషిగా ప్రకటించాలంటూ తనపై ఒత్తిడి తెచ్చారని, బ్లాక్ మెయిల్ చేశారని జడ్జి చెబుతున్న వీడియోను షరీఫ్ కుమార్తె మర్యం నవాజ్ విడుదల చేశారు. లాహోర్ లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడుతూ, తన తండ్రి కేసు విచారణ మొత్తం చాలా ఒత్తడి మధ్య కొనసాగిందని చెప్పారు.

అవినీతికి పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లేకపోయినా షరీఫ్ ను దోషిగా బలవంతంగా ప్రకటించాల్సి వచ్చిందని జడ్జి మాలిక్ చెబుతున్నట్టు వీడియోలో ఉంది. ఈ వీడియో పాకిస్థాన్ లో ఇప్పుడు కలకలం రేపుతోంది. మరోవైపు ఈ వీడియోపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం స్పందించింది. ఇది ఫేక్ వీడియో అని... దీనిపై ఫోరెన్సిక్ నిపుణుల చేత పరీక్ష చేయించాలని వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థపై జరుగుతున్న దాడిగా దీన్ని అభివర్ణించింది.

మర్యం నవాజ్ మీడియాతో మాట్లాడుతూ, మనీలాండరింగ్ కు పాల్పడినట్టు, కమిషన్లు తీసుకున్నట్టు, తప్పుడు ఆర్థిక లావాదేవీలను నిర్వహించినట్టు ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఒత్తిడికి లోబడి జడ్జి మాలిక్ తీర్పును వెలువరించారని అన్నారు. తన తండ్రిని జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. షరీఫ్ కు శిక్ష విధించకపోతే... ఓ ప్రైవేట్ వీడియోను విడుదల చేస్తామంటూ జడ్జిని కొందరు బ్లాక్ మెయిల్ చేశారని చెప్పారు. జైలు శిక్షను విధిస్తున్నట్టు జడ్జి తీర్పును రాయలేదని... ఆయన చేత బలవంతంగా రాయించారని మండిపడ్డారు. తన తండ్రికి శిక్షను విధించే విషయంలో జడ్జి మాలిక్ ఎంతో ఒత్తిడికి గురయ్యారని... ఈ క్రమంలో పలుమార్లు ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించారని చెప్పారు.

తన తండ్రిని చట్ట వ్యతిరేకంగా జైలుకు పంపించారనే విషయం ఇప్పుడు స్పష్టమైందని... తన తండ్రిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇస్లామాబాద్ హైకోర్టులో షరీఫ్ బెయిల్ కేసు విచారణ సమయంలో ఈ వీడియోను న్యాయస్థానానికి అప్పగిస్తామని చెప్పారు.

More Telugu News