Journalist: 25 ఏళ్ల పనిమనిషిపై 53 ఏళ్ల జర్నలిస్ట్ అత్యాచార యత్నం

  • రాత్రి ఒంటిగంట సమయంలో బలవంతంగా పనిమనిషి గదిలోకి
  • తప్పించుకుని రెండు గంటలపాటు బాత్రూములోనే దాక్కున్న యువతి
  • కేసు నమోదు చేసినా అరెస్ట్ చేయని పోలీసులు

పనిమనిషిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ జాతీయ దినపత్రిక జర్నలిస్టుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 4న అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో తన గదిలో నిద్రపోతున్న 25 ఏళ్ల యువతిపై జర్నలిస్ట్ అత్యాచార యత్నానికి పాల్పడ్డినట్టు గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. నిందితుడి ఇంట్లో ఆమె పూర్తిస్థాయి పని మనిషిగా ఉంటున్నట్టు పేర్కొన్నారు.  53 ఏళ్ల నిందితుడిపై గురువారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఒడిశాకు చెందిన బాధితురాలి కథనం ప్రకారం.. రాత్రి ఒంటి గంట సమయంలో నిందితుడి డ్రైవర్ యువతికి ఫోన్ చేసి తలుపు తెరవాలని కోరాడు. అనంతరం ఆమె గదిలోకి బలవంతంగా చొరబడిన జర్నలిస్ట్ దుస్తులు విప్పేసి ఆమెను అసభ్యకరంగా తాకాడు. దీంతో అతడి చెర నుంచి  తప్పించుకుని బాత్రూములోకి దూరిన బాధితురాలు రెండు గంటల తర్వాత ఎలాగోలా తప్పించుకుని బయటపడింది.

అనంతరం అదే కాలనీలో ఉంటున్న స్నేహితురాలి వద్దకు వెళ్లింది. తెల్లవారిన తర్వాత పోలీసులను ఆశ్రయించినట్టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీఎల్ఎఫ్) కరణ్ గోయల్ తెలిపారు. కాగా, కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇప్పటి వరకు నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు.

More Telugu News