Amarinder Singh: కాంగ్రెస్ కు ఎలాంటి అధినేత కావాలో చెప్పిన పంజాబ్ సీఎం అమరీందర్

  • దేశ జనాభాలో 65 శాతం 35 ఏళ్ల లోపువారే
  • ప్రజాకర్షణ ఉన్న యువనేతను అధ్యక్షుడిగా చేయాలి
  • యువతను ఆకర్షించే ఛరిష్మా ఉండాలి

కాంగ్రెస్ పార్టీ అధినేత పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో సీనియర్ నేత మోతీలాల్ వోరాను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే పనిలో పార్టీ హైకమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పార్టీకి ఎలాంటి అధినేత ఉండాలనే అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రజాకర్షణ కలిగిన యువనేతకు పార్టీ బాధ్యతలను అప్పగిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీడబ్ల్యూసీ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ, దేశంలో యువత సంఖ్య పెరుగుతోందని... ఈ నేపథ్యంలో, వారిని ఆకర్షించేందుకు రాహుల్ స్థానంలో మరో యువనేతను ఎంపిక చేయాలని సూచించారు.

యువనాయకత్వానికి రాహుల్ మార్గం చూపించారని అమరీందర్ అన్నారు. దేశ జనాభాలో 65 శాతం 35 ఏళ్ల లోపు వయసున్నవారే ఉన్నారని తెలిపారు. రాహుల్ రాజీనామా చాలా నిరాశను కలిగించిందని... పార్టీకి ఇది భారీ కుదుపని చెప్పారు. మరో డైనమిక్ యువ నాయకుడి నేతృత్వంలోనే పార్టీ మళ్లీ పుంజుకోగలదని తెలిపారు. పార్టీకి పునర్వైభవాన్ని తీసుకొచ్చే స్థాయి, నాయకత్వ లక్షణాలు, ఛరిష్మా ఆ యువనేతకు ఉండాలని సూచించారు. దేశంలోని యువతకు కనెక్ట్ అయ్యేలా ఆ యువనేత ఉండాలని... సరికొత్త ఆలోచనలతో పార్టీకి కొత్త జవసత్వాలను అందించాలని అన్నారు.

More Telugu News