Karnataka: కర్ణాటక సీఎం అమెరికాలో, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంగ్లాండ్ లో... అదనుచూసి దెబ్బకొట్టిన రెబెల్స్!

  • 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్ శాసనసభ్యులు రాజీనామా
  • సంక్షోభంలో కుమారస్వామి సర్కారు
  • రేపు రాష్ట్రానికి రానున్న కుమారస్వామి, దినేశ్ గుండూరావు

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి కాలం చెల్లిందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కుమారస్వామి ప్రభుత్వం సంక్షోభంలో పడింది! కర్ణాటకలో ఇంత జరుగుతున్న సమయంలో అటు సీఎం కుమారస్వామి కానీ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు కానీ రాష్ట్రంలో లేకపోవడం గమనార్హం. కుమారస్వామి అమెరికాలో ఉండగా, దినేశ్ గుండూరావు ఇంగ్లాండ్ లో ఉన్నారు.

11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలుసుకున్న ఈ ఇద్దరు అగ్రనేతలు హుటాహుటీన కర్ణాటక చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కుమారస్వామి రేపు బెంగళూరు చేరుకుని, పరిస్థితిని సమీక్షించనున్నారు. దినేశ్ గుండూరావు కూడా రేపు కర్ణాటక చేరుకుంటారని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు, ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారంలో తమ ప్రమేయంలేదని చెబుతున్న బీజేపీ నేత యడ్యూరప్ప, మరోవైపు, వారు మద్దతిస్తే స్వీకరిస్తామని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ కథంతా కమలనాథుల మాస్టర్ ప్లాన్ లో భాగమేనన్న సందేహాలు కలుగుతున్నాయి.

More Telugu News