Karnataka: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడితే యడ్యూరప్పే సీఎం: సదానందగౌడ

  • కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు
  • 14 మంది కూటమి ఎమ్మెల్యేల రాజీనామా
  • గవర్నర్ ఆహ్వానిస్తే ప్రభుత్వం ఏర్పాటుచేస్తామంటున్న బీజేపీ

కర్ణాటకలో రాజకీయ పరిస్థితులు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఇప్పటివరకు అధికార పీఠంపై ఉన్న జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి గడ్డుపరిస్థితులు వచ్చిపడ్డాయి. 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో విధానసభలో కూటమికి బలం తగ్గింది. ఈ నేపథ్యంలో, బలనిరూపణ అంశం కీలకంగా మారింది. దీనిపై బీజేపీ నేత సదానందగౌడ మాట్లాడుతూ, కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడితే యడ్యూరప్పే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. గవర్నర్ ఆహ్వానిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో తమదే అతిపెద్ద పార్టీ అని వెల్లడించారు. అయితే, ఎవర్ని ఆహ్వానించాలనేది గవర్నర్ విచక్షణపై ఆధారపడి ఉంటుందని అన్నారు.

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉండగా, బీజేపీకి 105 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్ కు 78 మంది సభ్యులు ఉండగా, జేడీఎస్ కు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సాధారణ మెజారిటీకి 113 మంది సభ్యులు అవసరం కావడంతో, జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నాయి. ఇప్పుడు 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో కూటమి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

More Telugu News