Pawan Kalyan: ఓడిపోతామని ముందే తెలుసు: అమెరికాలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

  • సీట్లు రావని తెలుసు
  • విలువలతో కూడిన రాజకీయాలే చేశాను
  • క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి
  • తానా సభల్లో పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సీట్లు రావని, ఓడిపోతామని ముందే తెలుసునని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో మాట్లాడిన ఆయన, ప్రతి ఓటమి నుంచి ఓ పాఠం నేర్చుకుంటున్నానని అన్నారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయనున్నానని అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలుగా ప్రజలు విడిపోరాదని పిలుపునిచ్చారు. తాను తానా సభలకు వెళ్లాలా? వద్దా? అని మధనపడ్డానని, కొందరు వెళ్లాలని, కొందరు వద్దని అన్నారని, చివరకు రావాలనే నిర్ణయించుకున్నానని అన్నారు.
 
మనుషులను కలిపేలా జనసేన రాజకీయాలు ఉంటాయని స్పష్టం చేసిన ఆయన, డబ్బులు లేకుండా రాజకీయాలు చేయడం కష్టమని తనకు తెలుసునని, అయితే, మారే ప్రజల కోసం తాను నమ్మిన మార్గంలోనే నడుస్తానని అన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తులే రాజకీయాల్లో తిరుగుతున్నారని, అటువంటిది తాను రాజకీయాల్లో కొనసాగితే తప్పేంటని ప్రశ్నించారు. అపజయం తనను మరింత బలోపేతం చేసిందని, పాలకులు భయపెట్టి పాలిస్తామంటే కుదిరే పరిస్థితి నేటి సమాజంలో లేదని హెచ్చరించారు.

నాయకులు నియంతలుగా మారితే ప్రజలు గుణపాఠం చెబుతారని, చరిత్ర ఎన్నోమార్లు ఈ సత్యాన్ని చెప్పిందని, విలువలతో రాజకీయాలు చేయబట్టే జనసేన ఓడిపోయిందని అన్నారు. జనసేన పార్టీకి ఎన్నో సమస్యలు ఉన్నాయని, తమలో తప్పులు ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వాలని ఎన్నారైలకు పవన్ కల్యాణ్ సూచించారు. పవన్ కల్యాణ్ తో పాటు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సైతం తానా సభల్లో పాల్గొన్నారు.

More Telugu News