Andhra Pradesh: కేంద్ర బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదు: చంద్రబాబు

  • వివిధ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వలేదు
  • పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదు
  • సామాన్య, మధ్య తరగతి పొదుపు శక్తి పెంచే దిశగా లేదు

కేంద్ర బడ్జెట్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. దేశ, ఏపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త బడ్జెట్ లేదని అన్నారు. వివిధ రంగాల అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వలేదని, సామాన్య, మధ్య తరగతి పొదుపు శక్తి పెంచే దిశగా అంశాలు లేవని విమర్శించారు. రైతులు, మహిళలు, యువత ఆశలు నెరవేర్చే దిశగా బడ్జెట్ లేదని అభిప్రాయపడ్డారు.

కేంద్ర బడ్జెట్ ఏపీ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిందని, ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను పూర్తిగా విస్మరించారని, ఏపీకి ఇవ్వాల్సిన తొలి ఏడాది ఆర్థికలోటు భర్తీని ఇంకా తేల్చలేదని, రూ.16 వేల కోట్ల లోటుకు గాను రూ.4 వేల కోట్లే ఇచ్చారని విమర్శించారు. ఇంకా ఇవ్వాల్సిన మిగిలిన మొత్తం గురించి బడ్జెట్ లో పేర్కొనకపోవడం ఆందోళనకరమని అన్నారు.

ఏపీలో ఐఐటీ, నిట్, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, ఐజర్ సంస్థలకు ఒక్క పైసా ఇవ్వలేదని, అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్ లో కేటాయింపులు లేవని మండిపడ్డారు. విశాఖ, విజయవాడ మెట్రో, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు గురించిన ప్రస్తావనే లేదని, తీవ్ర ఆర్థిక లోటు ఉన్న ఏపీని విస్మరించడం కేంద్రానికి తగదని చంద్రబాబు అన్నారు.

More Telugu News