Pakistan: బాలాకోట్ దాడుల ఫలితం.. గగనతలాన్ని మూసేసి కోట్లాది రూపాయలు నష్టపోతున్న పాకిస్థాన్

  • బాలాకోట్ దాడుల తర్వాత గగన తలాన్ని మూసేసిన పాక్
  • పాక్ గగన తలం మీదుగా రోజుకు 400 విమానాల ప్రయాణం
  • రూ.680 కోట్లు నష్టపోయిన పాక్

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసింది. ఇప్పుడు అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటోంది. తమ గగనతలాన్ని మూసివేసిన పాకిస్థాన్ కోట్లాది రూపాయలు నష్టపోతోంది. ఇప్పటి వరకు దాదాపు రూ.688 కోట్ల (100 మిలియన్ డాలర్లు) మేర నష్టపోయింది.  

బాలాకోట్ దాడుల తర్వాత దేశంలో ఉన్న 11 గగనతల మార్గాల్లో కేవలం రెండింటిని మాత్రమే తెరిచి ఉంచి మిగతా వాటిని మూసేసింది. ఫలితంగా ఆ దేశం మీదుగా ప్రయాణించాల్సిన విమానాలు తమ మార్గాన్ని మార్చుకున్నాయి. నిజానికి పాక్ గగనతలం మీదుగా రోజుకు సగటున 400 విమానాలు రాకపోకలు సాగిస్తుండేవి. మూసివేత తర్వాత పాక్ గగనతలం బోసిపోయింది.  

ఏదైనా ఒక దేశం గగనతలం మీది నుంచి రాకపోకలు సాగించే విమానాలు వాటి బరువు, ప్రయాణించే దూరాన్ని బట్టి ఆ దేశానికి కొంతమొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పాకిస్థాన్ మీదుగా ప్రయాణించే బోయింగ్ 737 విమానానికి అయితే 580 డాలర్లు, ఎయిర్‌బస్ 380కి అయితే అంతకంటే పెద్ద మొత్తంలో ఆ దేశ సివిల్ ఏవియేషన్‌కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడా మొత్తాన్ని పాక్ నష్టపోయింది. ఇప్పటి వరకు పాక్ నష్టపోయిన ఆ మొత్తం విలువ రూ.688 కోట్లు.

More Telugu News