Hyderabad: అమీర్ పేట, మైత్రీవనం కోచింగ్ సెంటర్లపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం

  • భద్రతా ఏర్పాట్లు లేవంటూ 20 కోచింగ్ సెంటర్లకు తాళం
  • సూరత్ ఘటనతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
  • కోచింగ్ సెంటర్లకు నోటీసులు

హైదరాబాద్ నడిబొడ్డున ఉండే అమీర్ పేటలో ఉన్నన్ని కోచింగ్ సెంటర్లు మరెక్కడా ఉండవంటే అతిశయోక్తి కాదు. అక్కడి మైత్రీవనం నిండా సాఫ్ట్ వేర్, స్పోకెన్ ఇంగ్లీష్, సెల్ ఫోన్ రిపేరింగ్, ఎస్సై, బ్యాంకు, డీఎస్సీ... ఇలా చెప్పుకుంటూ పోతే శిక్షణాలయాల లిస్టు చాంతాడంత అవుతుంది. అందుకే ఇక్కడ రద్దీ అంతాఇంతా ఉండదు. కుర్రకారంతా ఇక్కడే కొలువైనంత సందడి కనిపిస్తుంది. అయితే, ఇక్కడ ఉన్న పలు కోచింగ్ సెంటర్ల నిబంధనలను పాటించడంలేదంటూ జీహెచ్ఎంసీ కొరడా ఝుళిపించింది. ముఖ్యంగా, అగ్నిప్రమాదాలను ఎదుర్కొనే సాధనసంపత్తి లేదని, విపత్తులను ఎదుర్కొనేందుకు తగిన భద్రతా చర్యలు కూడా తీసుకోలేదని జీహెచ్ఎంసీ వర్గాలు 20 కోచింగ్ సెంటర్లకు తాళం వేశారు.

ఇటీవల సూరత్ లోని ఓ శిక్షణ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగి పెద్దఎత్తున విద్యార్థులు మరణించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కఠినచర్యలకు ఉపక్రమించింది. ఇప్పటివరకు నగరంలోని కొన్ని వందల కోచింగ్ సెంటర్లకు నోటీసులు పంపినా, కొన్ని స్పందించలేదు. దాంతో తనిఖీలు జరిపి, అగ్నిప్రమాద భద్రతా ఏర్పాట్లను నిర్లక్ష్యం చేసిన కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు. మరికొన్ని కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు తమకు మరికొంత సమయం ఇస్తే తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకుంటామని కోరడంతో వాటికి మినహాయింపునిచ్చారు.

More Telugu News