మంచిర్యాలలో తెలంగాణ కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

04-07-2019 Thu 18:43
  • మంచిర్యాలకు వెళ్లిన కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీ
  • పోలీసుల తీరుకు నిరసనగా కాంగ్రెస్ ధర్నా
  • అటవీ అధికారులపై దాడిని ఖండించిన జగ్గారెడ్డి
రామగుండంలో యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. నేడు మంచిర్యాలలో పర్యటించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీని పోలీసులు అడ్డుకున్నారు. కొమరం భీం జిల్లా కొత్త సార్సాలకు వెళుతుండగా జగ్గారెడ్డితో పాటు జీవన్‌రెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, అటవీ అధికారులపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఓ నివేదికను రూపొందించి గవర్నర్‌కు అందజేస్తామన్నారు.