Andhra Pradesh: 2022 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది!: పీపీఏ సీఈవో రాజేంద్ర కుమార్ జైన్

  • కాఫర్ డ్యామ్ నిర్మాణం పాక్షికంగా పూర్తయింది 
  • ఈసారి పోలవరానికి 10 వేల క్యూసెక్కుల వరద రావొచ్చు
  • విజయవాడలో మీడియాతో మాట్లాడిన పీపీఏ సీఈవో జైన్

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఈరోజు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సమావేశం ముగిసింది. ఈ భేటీ అనంతరం పీపీఏ సీఈవో రాజేంద్ర కుమార్ జైన్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో మూడేళ్లు(2022) పడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కాఫర్ డ్యాం రక్షణ పనులు, వరద అంచనా వ్యవస్థలపై చర్చించామని వెల్లడించారు. ప్రస్తుతం కాఫర్ డ్యామ్ పని పాక్షికంగా పూర్తయిందనీ, వరదలు రాకముందే పనులను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

ఈసారి పోలవరం డ్యామ్ కు 10,000 క్యూసెక్కుల వరద వస్తుందని తాము అంచనా వేస్తున్నామని రాజేంద్ర కుమార్ జైన్ తెలిపారు. అయితే దీనివల్ల కాఫర్ డ్యామ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇప్పటివరకూ రూ.6,700 కోట్లు విడుదల చేసిందని అన్నారు. రేపు పోలవరం ప్రాజెక్టు పనులను పీపీఏ సభ్యులు పరిశీలిస్తారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను పెంచే విషయాన్ని కేంద్రం పరిధిలోని ఎస్టిమేషన్ కమిటీ పరిశీలిస్తోందని రాజేంద్ర కుమార్ చెప్పారు.

More Telugu News