Economic Survey: వృద్ధి రేటు 7 శాతం, లోటు 5.8 శాతం... పార్లమెంట్ ముందుకొచ్చిన ఆర్థిక సర్వే!

  • రేపు పార్లమెంట్ ముందుకు బడ్జెట్
  • నేడు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మల
  • ఇంధన ధరలు తగ్గుతాయని అంచనా 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి రేటు 7 శాతం వరకూ ఉండవచ్చని, ఇదే సమయంలో ద్రవ్య లోటు 5.8 శాతానికి పెరుగుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. శుక్రవారం నాడు పార్లమెంట్ ముందుకు 2019-20 ఆర్థిక సంవత్సరపు పూర్తి బడ్జెట్ ప్రతిపాదనలు రానున్న నేపథ్యంలో, నేడు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణమూర్తి సుబ్రమణియన్ నేతృత్వంలో తయారైన సర్వేను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభ ముందుంచారు.

ఈ సంవత్సరం ముడి చమురు ధరలు భారీగా తగ్గే అవకాశాలున్న నేపథ్యంలో పెట్రో ధరల నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని ఈ సర్వే అంచనా వేసింది. ప్రపంచంలో మారుతున్న పరిణామాల క్రమంలో క్రూడాయిల్ ధరలు తగ్గుతాయని భావిస్తున్నట్టు పేర్కొంది. ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ వనరులు పెరుగుతున్నాయని, వాణిజ్య ఉద్రిక్తతల వల్లే ఎగుమతులు తగ్గాయని సర్వే అభిప్రాయపడింది. భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లను చేరాలంటే 8 శాతం వృద్ధి రేటు అవసరమని, ఈ సర్వే పేర్కొంది.

గత సంవత్సరం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులకు, కూలీలకు వేతనాలు పెరిగాయని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం వారికి అందుతున్నాయని వెల్లడించింది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా 2020లో విదేశీ పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని, సంపద సృష్టి మార్గం సుగమం అవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఈ సంవత్సరం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వృద్ధి రేటు కొంత మందగించవచ్చని పేర్కొంది. 

More Telugu News