BJP: యూపీ బీజేపీ ఎమ్మెల్యే హత్యకేసు.. నిర్దోషిగా బయటపడిన గ్యాంగ్‌స్టర్ పొలిటీషియన్ ముఖ్తార్ అన్సారీ

  • 2005లో హత్యకు గురైన కృష్ణానంద్ రాయ్
  • 14 ఏళ్లపాటు కొనసాగిన విచారణ
  • సరైన సాక్ష్యాలు సమర్పించడంలో పోలీసుల విఫలం

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ పొలిటీషియన్ ముఖ్తార్ అన్సారీని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది. ఈ కేసులో సరైన సాక్ష్యాలు సమర్పించడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో ముఖ్తార్‌తోపాటు మరో ఐదుగురు నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ విడుదల చేసింది.

ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ 2005లో హత్యకు గురయ్యారు. అంతకు ఏడాది క్రితం ఆయనపై అన్సారీ సోదరులు కాల్పులు జరిపారు. అయితే, ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రాణాలకు ముప్పు ఉండడంతో అప్పటి ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం ఐదుగురు భద్రతా సిబ్బందిని కేటాయించింది.

అయితే, 29 నవంబరు 2005న రాయ్ కాన్వాయ్‌పై బుల్లెట్ల వర్షం కురిసింది. పది నిమిషాలపాటు ఆపకుండా జరిపిన కాల్పుల్లో  ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు. దుండగుల కాల్పుల్లో ఎమ్మెల్యే కాన్వాయ్‌లో ఉన్న మరో ఆరుగురు కూడా మృతి చెందారు. ముఖ్తార్ అన్సారీ, అఫ్జల్ అన్సారీలతోపాటు మరికొందరిపై పోలీసులు చార్జ్ షీటు నమోదు చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే సోదరుడు రామ్ నారాయణ్ రాయ్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నప్పటికీ సరైన సాక్ష్యాధారాలను సమర్పించడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది.

More Telugu News