Hafiz saeed: లష్కరే తాయిబా చీఫ్‌ హఫీజ్ సయీద్‌కు షాకిచ్చిన పాక్

  • సేవా సంస్థల ముసుగులో నిధుల సమీకరణ
  • రెండు రోజుల్లో 23 కేసులు
  • విచారణ ఎదుర్కోక తప్పదన్న సీటీడీ

ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ షాకిచ్చింది. ఉగ్రవాద చర్యల కోసం నిధులు సమీకరిస్తున్న ఆరోపణలపై హఫీజ్, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసినట్టు పాక్ ఉగ్రవాద వ్యతిరేక విభాగం (సీటీడీ) తెలిపింది. సేవా సంస్థల ముసుగులో ఆస్తులు సమీకరిస్తున్నందుకు గాను లాహోర్, గుజ్రాన్‌వాలా, ముల్తాన్‌లలో కేసులు నమోదు అయినట్టు సీటీడీ అధికారులు పేర్కొన్నారు.
 
జమాత్-ఉద్-దవా (జేయూడీ), లష్కరే తాయిబా (ఎల్‌ఈటీ), ఫలా-ఇ-ఇన్సానియత్ (ఎఫ్ఐఎఫ్) లపై ఈ నెల 1, 2 తేదీల్లో 23 కేసులు నమోదైనట్టు తెలిపారు. దవాత్-ఉల్-ఇర్షాద్ ట్రస్ట్, మౌజ్-బిన్-జబాల్, అల్-అన్ఫాల్ ట్రస్ట్, అల్-హమ్ద్ ట్రస్ట్, అల్-మదీనా ఫౌండేషన్ ట్రస్ట్ తదితర సేవా సంస్థల ముసుగులో నిధులు సమీకరిస్తున్నందుకు గాను ఈ కేసులు నమోదైనట్టు సీటీడీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

కేసులు నమోదైన వారిలో  హఫీజ్ సయీద్‌తోపాటు అబ్దుల్ రెహ్మాన్ మక్కి, మాలిక్ జఫార్ ఇక్బాల్, అమీర్ హమ్జా, ముహమ్మద్ యాహ్యా అజీజ్, ముహమ్మద్ నయీమ్, మోసిన్ బిలాల్, అబ్దుల్ రఖీబ్, డాక్టర్ అహ్మద్ దావూద్, డాక్టర్ ముహమ్మద్ ఆయుబ్, అబ్దుల్లా ఉబైద్, ముహమ్మద్ అలీ, అబ్దుల్ గఫార్ తదితరులు ఉన్నారు. వీరంతా విచారణ ఎదుర్కోక తప్పదని సీటీడీ తేల్చి చెప్పింది.

More Telugu News