Vinod: యువతుల ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

  • సామాజిక మాధ్యమాల ద్వారా ఫొటోల సేకరణ
  • మార్ఫింగ్ చేసి అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్
  • పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడవద్దని డీసీపీ సూచన

విశాఖకు చెందిన వినోద్ అనే వ్యక్తి యువతుల ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నాడు. అతడి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఓ యువతి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నేడు అతడిని అరెస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువతుల ఫొటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

ఈ సందర్భంగా సైబర్ క్రైం అదనపు డీసీపీ రఘువీర్ మాట్లాడుతూ, ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాలని పేర్కొన్నారు. పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడటం కానీ, సమాచార మార్పిడి కానీ యువతులు చేయవద్దని సూచించారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారాన్ని ఉంచవద్దని రఘువీర్ స్పష్టం చేశారు.  

More Telugu News