Andhra Pradesh: 'నాకు అబద్ధాలు చెప్పడం అలవాటే' అని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా అన్నారు!: సీఎం జగన్

  • చంద్రబాబుకు అబద్ధాలు చెప్పే అలవాటు గట్టిగా ఉంది
  • ఓ ప్రాజెక్టుకు సంబంధించి 50 పేజీల తప్పుడు డాక్యుమెంట్ చదివారు
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణ తరగతుల ప్రారంభం సందర్భంగా సీఎం ప్రసంగం

అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది ఉండాలనీ, నిర్మాణాత్మక చర్చ అన్నది జరగాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తాను అసెంబ్లీలో సీఎం హోదాలో మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష నేత  చంద్రబాబు లేవగానే ‘బంగారంగా మాట్లాడండి చంద్రబాబు గారూ’ అని కూర్చున్న విషయాన్ని జగన్ గుర్తుచేశారు.

‘ప్రతిపక్ష నేత మాట్లాడిన విషయాలు, చేసిన ఆరోపణలపై మరింత లాజిక్ తో, సమర్థవంతంగా జవాబు ఇస్తే ప్రజలు దాన్ని చూస్తారు. ఎవరు ఏ విషయాలను మాట్లాడారు అన్న పాయింట్ ప్రజల్లోకి వెళుతుంది. ఈ ధైర్యం మనకు ఉన్నప్పుడు మనం(వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) ఎందుకు భయపడాలి? ఎవరో లేస్తారని మనం భయడాల్సిన పనిలేదు’ అని చెప్పారు. అమరావతిలోని అసెంబ్లీ హాలులో ఈరోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణా తరగతుల సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం జగన్ విమర్శించారు. ‘‘చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా అబద్ధాలు చెప్పే అలవాటు ఉంది. ఈ పదాన్ని శాసనసభలో సత్యదూరం అని చెప్పాల్సి వస్తుంది. గతంలో నాయన సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చంపల్లో, ఎల్లంపల్లో ప్రాజెక్టుకు సంబంధించి 50 షీట్ల డాక్యుమెంట్ ను చంద్రబాబు అసెంబ్లీకి తీసుకొచ్చారు. గడగడా చదవడం మొదలుపెట్టారు. మొదటి కొద్దిసేపు నాన్నతో పాటు ఎవ్వరికీ ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత డేటా మొత్తం తీసుకొచ్చాక తెలిసింది ఏంటంటే.. చంద్రబాబు తప్పుడు డాక్యుమెంట్ తీసుకొచ్చి మాట్లాడారు.

దీంతో తర్వాతి రోజు నాన్న ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొచ్చి అసెంబ్లీలో చూపించారు. ఏందయ్యా చంద్రబాబు? ఇలా చేశావ్? అని అడిగితే చంద్రబాబు స్పందిస్తూ.. ‘నాకు ఇలా అబద్ధాలు ఆడటం సహజమే.. మేం అబద్ధాలు చెబితేనే మీరు నిజాలు బయటపెడతారు’ అని ఆన్ ది రికార్డ్ అన్నారు. ఇది నాకు షాకింగ్ గా అనిపించింది. దయచేసి నేను చెప్పేది ఒక్కటే. అటువంటి చర్యలు, అబద్ధాలు, మోసాలు చేసే కార్యక్రమం మనం చేయకూడదు. మనం తప్పు చేయనప్పుడే ఎదుటివారికి చెప్పగలుగుతాం’ అని సీఎం జగన్ తెలిపారు. అసెంబ్లీ, శాసనమండలికి సభ్యులంతా రెగ్యులర్ గా రావాలని సూచించారు.

More Telugu News