Andhra Pradesh: ఎమ్మెల్యేలు ప్రిపేర్ అయి అసెంబ్లీకి రావాలి.. లేదంటే అందరం ఇబ్బంది పడతాం!: సుతిమెత్తగా హెచ్చరించిన సీఎం జగన్

  • అమరావతిలోని అసెంబ్లీ హాలులో జగన్ ప్రసంగం
  • అసెంబ్లీలో మాట్లాడాలనుకునే ఎమ్మెల్యేలు పేర్లు ఇవ్వాలని సూచన
  • శిక్షణా తరగతులకు టీడీపీ సభ్యుల డుమ్మా

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణా తరగతుల ప్రారంభం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. సభా సంప్రదాయాలు, నిబంధనలపై పుస్తకాలను ప్రతీ సభ్యుడు క్షుణ్ణంగా చదవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ సూచించారు. అమరావతిలోని అసెంబ్లీ హాలులో జరుగుతున్న సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. ‘సభలో మన సంఖ్య ఎక్కువ కదా. మనం చేయి ఎత్తితే స్పీకర్ గారు అవకాశం ఇస్తారని చాలామంది భావిస్తారు. కానీ అలా జరగకపోవచ్చు. ఎందుకంటే ఫలానా అంశంపై వీరు-వీరు మాట్లాడుతారని స్పీకర్ గారికి లిస్ట్ ఇచ్చి ఉంటాం. ఆ లిస్ట్ ప్రకారమే స్పీకర్ గారు అందరికీ అవకాశం ఇస్తారు. ఆ జాబితాలో మన పేరు లేకపోతే మనకు అవకాశం రాకపోవచ్చు. దీనికి మరోలా అనుకోవాల్సిన పనిలేదు’ అని తెలిపారు.

ఏయే విషయాలపై ఎవరెవరు మాట్లాడాలని అనుకుంటున్నారో, ఆయా పార్టీల శాసనసభ వ్యవహారాల ఇన్ చార్జులకు సమాచారం ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు. ‘అసెంబ్లీలో ఓ సబ్జెక్ట్ పై మాట్లాడేటప్పుడు పూర్తిగా ప్రిపేర్ అయి రావాలి. అసెంబ్లీలో మాట్లాడే ప్రతీ స్పీచ్ విజయవంతం కావడం అన్నది మనం ఎంతగా సిద్ధం అయివచ్చామో అనేదానిపైన ఆధారపడి ఉంటుంది.

మనం ఎంత గొప్ప స్పీకర్ అయినా ప్రిపేర్ అయి రాకుంటే ఫెయిలవుతారు. మనం ప్రిపేర్ కాకుండా అప్పటికప్పుడు మాట్లాడితే ఎదుటివారు లేచి ఓ డాక్యుమెంట్ తీసి 'ఇదిగో చూడు.. తెలియకపోతే తెలుసుకో' అని అన్నారనుకోండి.. మనమంతా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోతాం. ఈ విషయాన్ని ఎవ్వరూ మర్చిపోవద్దు’ అని సీఎం జగన్ చెప్పారు. కాగా, ఈ శిక్షణా తరగతులకు జనసేన, బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు హాజరుకాగా, టీడీపీ సభ్యులు మాత్రం రాలేదు.

More Telugu News