India: మ్యాచ్ ముగిశాక 87 ఏళ్ల వృద్ధ అభిమానిని కలిసిన రోహిత్, కోహ్లీ.. ముద్దిచ్చి ఆశీర్వదించిన బామ్మగారు!

  • క్రికెట్‌పై ఆమెకున్న అభిరుచికి ప్రేక్షకులు ఫిదా
  • కలిసి మాట్లాడిన కెప్టెన్, వైస్ కెప్టెన్
  • వీడియో, ఫొటోలు పోస్టు చేసిన కోహ్లీ

ప్రపంచకప్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా స్టేడియంలో కనిపించిన ఓ వ్యక్తి మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. కెమెరాలు కూడా ఆమెను పదేపదే చూపించడంతో భారత అభిమానులు ఫిదా అయ్యారు. భారత జట్టుకు ఫ్యాన్ అయిన ఆ వ్యక్తి పేరు చారులతా పటేల్. 87 ఏళ్ల వయసులో స్టేడియంలో ఆమె ఉత్సాహాన్ని చూసిన తోటి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మ్యాచ్‌లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన ఆమె వార్తల్లోని వ్యక్తి అయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

మ్యాచ్ ముగిశాక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆమెను ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. ఇద్దరి భుజాలపై చేతులు వేసి ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న చారులత వారి చెంపలపై ముద్దుపెట్టి ఆశీర్వదించింది. చారులతను కలిసిన ఫొటోలను కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయగా, ఐసీసీ వీడియోను పోస్టు చేసింది. తమకు మద్దతు పలికిన ఆమెకు ధన్యవాదాలు తెలిపాడు.

క్రికెట్‌పై ఆమెకున్న అభిరుచి, అంకితభావానికి సెల్యూట్ చేస్తున్నట్టు పేర్కొన్నాడు. తానెప్పుడూ ఇలాంటి అభిమానిని చూడలేదన్నాడు. వయసు అనేది ఒక నంబరు మాత్రమేనని, అభిరుచి హద్దులను చెరిపేస్తుందని పేర్కొన్నాడు. ఇక నుంచి ఆమె ఆశీస్సులు తమకు ఉంటాయని ఆకాంక్షించాడు. అలాగే, అభిమానులకు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపాడు.

More Telugu News