Turkey: టర్కీ మొదటి మహిళ చేతిలో 50 వేల డాలర్ల విలువైన హ్యాండ్‌బ్యాగ్.. కురుస్తున్న విమర్శల జడివాన!

  • ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న టర్కీ
  • ధరల పెరుగుదలతో ప్రజల అష్టకష్టాలు
  • తీవ్ర చర్చకు కారణమైన ఫస్ట్ లేడీ బ్యాగ్

ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన టర్కీ అందులోంచి బయటపడేందుకు అష్టకష్టాలు పడుతోంది. ఇలాంటి సమయంలో ఆ దేశ మొదటి మహిళ ఎమైన్ ఎర్డోగాన్ చేతిలో 50వేల డాలర్ల విలువైన హ్యాండ్ బ్యాగ్ కనిపించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. భర్త, అధ్యక్షుడు రెసెప్ తయ్యిపి ఎర్డోగాన్‌తో కలిసి ఇటీవల జపాన్‌లో పర్యటించిన ఆమె చేతిలోని బ్యాగ్ అందరినీ ఆకర్షించింది. సోషల్ మీడియాలో అది చర్చకు దారితీసింది.

దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి నానా కష్టాలు పడుతున్న వేళ అంత విలువైన బ్యాగ్‌ను ధరించడం ఏంటంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఆమె బ్యాగ్‌కు పెట్టిన ఖర్చుతో 11 మంది ఏడాదిపాటు హాయిగా జీవించవచ్చని పేర్కొన్నారు. విలాసవంతమైన లైఫ్ స్టైల్‌తో ఆమె గతంలోనూ విమర్శలు ఎదుర్కొన్నారు. దేశంలో ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతుంటే అధ్యక్ష భవనం మాత్రం విలాసాలను వీడడం లేదని అక్కడి పత్రికలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఎర్డోగాన్ పాలనలో 1150 గదులతో అధ్యక్ష భవనాన్ని నిర్మించడాన్ని దునుమాడుతున్నాయి.

More Telugu News