India: డెత్ ఓవర్లలో డీలాపడిన టీమిండియా.... బంగ్లాదేశ్ టార్గెట్ 315 రన్స్

  • 5 వికెట్లు తీసిన ముస్తాఫిజూర్
  • చివర్లో క్యూ కట్టిన టీమిండియా బ్యాట్స్ మెన్
  • చివరి ఓవర్లో ముగ్గురు ఆటగాళ్లు పెవిలియన్ చేరిక

బర్మింగ్ హామ్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. మొదట్లో రోహిత్-రాహుల్, ఆ తర్వాత కోహ్లీ, పంత్ క్రీజులో ఉన్నంతవరకు దూకుడుమీదున్న భారత్, వారి నిష్క్రమణ తర్వాత డీలాపడిపోయింది. ముఖ్యంగా, ఆఖరి ఓవర్లలో పేలవ ఆటతీరు కనబర్చింది. ఓ దశలో స్కోరు 350 పైచిలుకు నమోదవుతుందని అంచనా వేసినా, డెత్ ఓవర్లలో భారత్ ను బంగ్లాదేశ్ బౌలర్లు కట్టడి చేశారు.

చివరి 5 ఓవర్లలో టీమిండియా 4 వికెట్లు చేజార్చుకుని 35 పరుగులే చేసింది. సాధారణంగా ఆఖరి ఓవర్లలో పదికి పైగా రన్ రేట్ తో స్కోరుబోర్డు పరుగులు పెడుతుంటుంది. అందుకు భిన్నంగా, ధోనీ (35), కార్తీక్ (8) ఆశించిన మేర రాణించకపోవడంతో భారత్ పడుతూ లేస్తూ ముందుకుసాగింది. భారత్ 314 పరుగులకే పరిమితం కావడంలో బంగ్లాదేశ్ ప్రధాన ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్ ముఖ్యభూమిక పోషించాడు. మొత్తం 5 వికెట్లు తీసి భారత బ్యాటింగ్ లైనప్ పై ప్రభావం చూపాడు. టీమిండియా తన చివరి ఓవర్లో 3 వికెట్లు కోల్పోయింది.

అంతకుముందు, ఓపెనర్ రోహిత్ శర్మ (104 )దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బంగ్లా బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ రికార్డు స్థాయిలో నాలుగో సెంచరీ సాధించాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం ఫామ్ ను కొనసాగిస్తూ 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్లిద్దరి తర్వాత 48 పరుగులతో రిషబ్ పంత్ ఆకట్టుకున్నాడు.

More Telugu News