Chandrababu: చంద్రబాబు పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టులో ఆసక్తికర వాదనలు!

  • ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ భద్రత ఇచ్చామన్న సర్కారు
  • చంద్రబాబు కుటుంబసభ్యుల భద్రత కూడా తగ్గించారన్న న్యాయవాది
  • ప్రమాణపత్రం దాఖలు చేయాలంటూ సర్కారుకు హైకోర్టు ఆదేశం

తనకు భద్రత తగ్గించారంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను జూలై 9కి వాయిదా వేసింది. కాగా, నేటి విచారణ సందర్భంగా వాదప్రతివాదాలు ఎంతో ఆసక్తికరంగా సాగాయి. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబుకు భద్రత తగ్గించారని, రాజకీయ కారణాలతో ఆయన్ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారని చంద్రబాబు తరఫు న్యాయవాది సుబ్బారావు వాదనలు మొదలుపెట్టారు.

దీనికి ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ బదులిచ్చారు. ఓ మాజీ ముఖ్యమంత్రికి ఎక్కడైనా 58 మందిని మాత్రమే భద్రత కింద కేటాయిస్తారని, కానీ తాము అంతకంటే ఎక్కువగా 74 మంది భద్రతా సిబ్బందిని చంద్రబాబుకు ఇచ్చామని వివరించారు. ఇందులో తాము చంద్రబాబుకు ఎక్కడ భద్రత తగ్గించినట్టు? అని శ్రీరామ్ తన వాదనలు వినిపించారు.

దీనిపై, చంద్రబాబు న్యాయవాది సుబ్బారావు స్పందిస్తూ, చంద్రబాబుకే కాకుండా ఆయన కుటుంబ సభ్యులకు కూడా భద్రత తగ్గించారని, మావోలు, ఎర్రచందనం స్మగ్లర్లు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నారని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఇప్పటికిప్పుడు చంద్రబాబు భద్రతలో భాగంగా ఎక్కడ, ఎంతమంది, ఏ స్థానాల్లో విధులు నిర్వర్తిస్తున్నారో పూర్తి వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఏపీ సర్కారును ఆదేశించారు.

More Telugu News