yanamala: అన్నం మొత్తం చూడాల్సిన అవసరం లేదు.. మెతుకు పట్టుకుంటే సరిపోతుంది: యనమల

  • ప్రజా ప్రభుత్వం పోయి.. ఫాసిస్ట్ ప్రభుత్వం వచ్చింది
  • రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు
  • రాష్ట్రమంతా అనిశ్చిత పరిస్థితి నెలకొంది

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పోయి, ఫాసిస్ట్ ప్రభుత్వం వచ్చిందని చెప్పారు. విపక్ష నేతలపై దాడులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మండిపడ్డారు.

సంక్షేమాన్ని దెబ్బతీసేలా, అభివృద్ధిని కుంటుపరిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. నెల రోజుల్లోనే ప్రభుత్వ అసమర్థత అందరికీ అర్థమవుతోందని చెప్పారు. ఈ ఖరీఫ్ లో కరవు పరిస్థితి నెలకొందని... విత్తనాలు దొరక్క రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. విత్తనాలకు రూ. 380 కోట్లు కూడా ఇవ్వలేని వారు... వేల కోట్ల రూపాయల హామీలను ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు. ఉడికిందో, లేదో తెలుసుకోవడానికి అన్నం మొత్తం చూడాల్సిన అవసరం లేదని... ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు.

నినాదాలు పుష్కలం, నిర్వహణ అధ్వానం అనే రీతిలో జగన్ పాలన సాగుతోందని యనమల విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా పట్టించుకోవడం లేదని... రాజకీయ కక్ష సాధింపులు తప్ప మరేమీ మీకు పట్టవా? అని ప్రశ్నించారు. కమిటీల పేరుతో అమరావతి నిర్మాణాన్ని ఆపేశారని మండిపడ్డారు. పేదలకు మేలు చేస్తానని వచ్చిన జగన్ ఒక ఫాసిస్టుగా మారారని అన్నారు. మా భవనాలను, పేదల ఇళ్లను కూల్చినంత మాత్రాన మీరు గొప్పవారు కాలేరని చెప్పారు. రాష్ట్రమంతా అనిశ్చిత పరిస్థితి నెలకొందని అన్నారు. కక్ష సాధింపులు, బురద చల్లడం మానేసి ప్రజలకు మేలు చేయాలని, రైతులను ఆదుకోవాలని సూచించారు. ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే సత్తా టీడీపీకి ఉందని చెప్పారు.  

More Telugu News