Congress: నేనుండనంటే ఉండనంతే: తేల్చి చెప్పిన రాహుల్ గాంధీ

  • కాంగ్రెస్ చీఫ్‌గా మీరే కొనసాగాలంటూ సీఎంల విజ్ఞప్తి
  • తన నిర్ణయాన్ని మార్చుకోబోనన్న రాహుల్
  • పంజాబ్ సీఎంకు రాహుల్ అభినందన

కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలన్న తన నిర్ణయాన్ని మార్చుకునే ఉద్దేశం లేదని రాహుల్ గాంధీ మరోమారు స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా మీరే కొనసాగాలంటూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోమవారం చేసిన అభ్యర్థనను రాహుల్ సున్నితంగా తిరస్కరించారు. రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోమవారం రాహుల్‌ను కలిసి లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడిగా మీరే కొనసాగాలని కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారని రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు.
 
రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ సీఎంలు అశోక్ గెహ్లట్, కమల్ నాథ్‌లు ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే, ఆయన మాత్రం వెనక్కి తగ్గేందుకు నిరాకరించారు. తన నిర్ణయాన్ని మార్చుకోబోనని స్పష్టంగా చెప్పేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మాట్లాడుతూ.. బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రజా సమస్యలపై కాకుండా ‘నకిలీ జాతీయవాదం’, ‘మతం’ పేరుతో ఎన్నికల్లో పోటీ చేసిందని ఆరోపించారు.

వారి ఆరోపణలపై రాహుల్ స్పందిస్తూ.. జరిగిందేదో జరిగిపోయిందని, ఇప్పుడా విషయాలను ప్రస్తావించడం సరికాదని హితవు పలికారు. గతంలో కంటే ఇప్పుడు మరింతగా కష్టపడాలని, నేను మీతోనే ఉంటానని భరోసా ఇచ్చారు. ఓటమికి ఏ ఒక్కరో బాధ్యత వహించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దాదాపు అన్ని చోట్లా ఓటమి పాలయ్యామని గుర్తు చేశారు. చాలాచోట్ల మంచి ఫలితాలు వస్తాయని భావించామని అయితే, అక్కడ కూడా విఫలమయ్యామని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పంజాబ్‌లో మంచి ఫలితాలు సాధించినందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను రాహుల్ అభినందించారు.

More Telugu News