India: ఇండియాను ఓడిస్తామన్న అతి విశ్వాసం లేదు.. కానీ ప్రయత్నిస్తాం!: బంగ్లా కెప్టెన్ మష్రఫె

  • నేడు ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్
  • గెలిస్తే సెమీస్ కు ఇండియా
  • ఓడించేందుకు ప్రయత్నిస్తామంటున్న బంగ్లా

సెమీస్ కు దాదాపుగా చేరుకున్నా, ఇంకా స్థానాన్ని ఖరారు చేసుకోని భారత్, మరో రెండు మ్యాచ్ లు గెలిస్తే, ఆశలను సజీవంగా ఉంచుకోవచ్చన్న ఆలోచనతో ఉన్న బంగ్లాదేశ్ మధ్య నేడు బర్మింగ్ హామ్ వేదికగా వరల్డ్ కప్ క్రికెట్ పోరు సాగనుండగా, బంగ్లా కెప్టెన్ మష్రఫె కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయిన భారత్ పై విజయం సాధిస్తామన్న అతి విశ్వాసంతో తాము బరిలోకి దిగబోమని అన్నాడు. ఈ మ్యాచ్ లో తమ సత్తా చాటుతామని, భారత్ అన్ని విభాగాల్లో బలంగా ఉన్నా, గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తామని అన్నాడు.

కాగా, ప్రస్తుతం ఏడు మ్యాచ్ లు ఆడి, ఏడు పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్న బంగ్లా జట్టు సెమీస్ కు చేరుకోవాలంటే, ఇండియా, పాక్ లపై ఆడాల్సిన మ్యాచ్ లను గెలవడంతో పాటు న్యూజిలాండ్‌ చేతిలో ఇంగ్లాండ్‌ ఓడిపోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మష్రఫె, ఇండియాపై గెలిచేందుకు తమ ప్లాన్ తమకుందని అన్నాడు. శక్తిమేర పోరాడి గెలిచేందుకు ప్రయత్నిస్తామని, ఈ ప్రపంచకప్‌ లో తాము ఉంటామా? లేదా? అనేది నేడు తేలుతుందని అన్నాడు. షకిబ్‌ అల్‌ హసన్‌ తన ఫామ్ ను కొనసాగిస్తే, గెలుపు సులువవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇండియన్ స్పిన్నర్స్ కుల్దీప్‌, చాహల్‌ బాగా రాణిస్తున్నారని కితాబిచ్చాడు.

More Telugu News