Telangana: సీఎం కేసీఆర్ మూఢనమ్మకాలతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు!: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి

  • ప్రభుత్వ భవనాలను వందేళ్ల సామర్థ్యంతో నిర్మిస్తారు
  • ఏపీ సీఎం ఈ భవనాలకు రూ.40 కోట్లు ఖర్చు పెట్టారు
  • సచివాలయం కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మూఢనమ్మకాలకు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని కాంగ్రెస్ నేత, లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ సచివాలయంలో ఉన్న ఏ భవనాన్ని కూడా 35 సంవత్సరాలకు మించి వినియోగించలేదని స్పష్టం చేశారు. ఏవైనా ప్రభుత్వ భవనాలు నిర్మించాలనుకుంటే, 100 సంవత్సరాలు ఉండేలా నిర్మిస్తారని తెలిపారు. ప్రస్తుతమున్న సచివాలయంలో అన్ని అత్యాధునిక సౌకర్యాలు, అధికారులందరికీ అవసరమైన వసతులు ఉన్నాయని చెప్పారు. ఏపీ, తెలంగాణ విభజన సందర్భంగా ఏపీకి 5.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న సచివాలయం లభిస్తే,  తెలంగాణకు దాదాపు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న స్థలం లభించిందన్నారు.

అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు మరో రూ.40 కోట్లు వెచ్చించి ఈ భవనాలకు మరమ్మతులు చేయించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణం చదరపు అడుగుకు రూ.10,000 చెల్లించాలని నిర్ణయించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. వెయ్యి కోట్ల విలువైన సచివాలయాన్ని బుల్ డోజర్లతో కూలగొట్టించడానికి కేసీఆర్ సిద్ధమయ్యారని విమర్శించారు. కేసీఆర్ మూఢనమ్మకాలను తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.

కేసీఆర్ ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా దాని అంచనాలు భారీగా పెరిగిపోతాయని వ్యాఖ్యానించారు. రూ.20,000 కోట్ల అంచనాలతో మొదలుపెట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కేసీఆర్ రూ.40 వేల కోట్లకు తీసుకెళ్లారని రేవంత్ విమర్శించారు. అలాగే రూ.40,000 కోట్లతో ప్రారంభించిన కాళేశ్వరం రూ.1.20 లక్షల కోట్లకు చేరుకుందని పేర్కొన్నారు. ఇప్పుడు రూ.400 కోట్లతో కడతామంటున్న సచివాలయం కూడా నిర్మాణం పూర్తయ్యే సరికి రూ.2,000 కోట్లకు చేరుకుంటుందని జోస్యం చెప్పారు.

More Telugu News