Telangana: ఆరునూరైనా కొత్త సచివాలయం, అసెంబ్లీ కట్టి తీరుతాం: మంత్రి తలసాని

  • ప్రజలు గర్వపడేలా ఈ రెండింటిని నిర్మిస్తాం
  • పబ్లిసిటీ కోసమే ‘కాంగ్రెస్’ నేతల విమర్శలు 
  • ప్రజలకు అవసరమైన పనులే ప్రభుత్వం చేస్తోంది

ఆరునూరైనా కొత్త సచివాలయం, అసెంబ్లీ కట్టి తీరుతామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు గర్వపడేలా ఈ రెండింటిని నిర్మిస్తామని చెప్పారు. పబ్లిసిటీ కోసమే కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని, ఏదో పిక్నిక్ కోసం వచ్చినట్టు సచివాలయం వద్దకు కాంగ్రెస్ నేతలు వచ్చి వెళ్లారని, నాలుగు గంటల పాటు అన్ని భవనాలను పరిశీలించవచ్చు కదా? అని ప్రశ్నించారు.

 ప్రజలకు అవసరమైన పనులనే కేసీఆర్ ప్రభుత్వం చేస్తోందని, గ్రూప్ తగాదాలు చూడలేకనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిపోతున్నారని విమర్శించారు. ప్రతిపక్షనేతగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఉండటం సొంత పార్టీ నేతలకే ఇష్టం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వర్షం పడితే ఏ నగరంలో అయినా గంటపాటు ఇబ్బందులు తప్పవని, ఒక్క హైదరాబాద్ లోనే ఏదో జరుగుతుందనే దుష్ప్రచారం సబబు కాదని హితవు పలికారు.

More Telugu News