Andhra Pradesh: ఏపీలో బుసలు కొడుతున్న డ్రగ్స్.. విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేసిన స్కూలు పిల్లాడు!

  • మా పాఠశాలలో చాలామంది డ్రగ్స్ తీసుకుంటున్నారు
  • ఈ పదార్థం కేవలం 10 రూపాయలకే దొరుకుతోంది
  • చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

తమ పాఠశాలలో చాలామంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నారని ఓ విద్యార్థి ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు ఫిర్యాదు చేశాడు. తాను ఏపీలోని రవీంద్ర భారతి స్కూలులో చదువుతున్నానని సదరు బాలుడు తెలిపాడు. తన స్కూలులోని 10, 9, 8వ తరగతి విద్యార్థులు చెప్పులు తెగితే అతికించేందుకు వాడే గమ్ లాంటి పదార్థాన్ని మత్తు కోసం తీసుకుంటున్నారని వెల్లడించాడు. ఈ పదార్థం రూ.10కే దొరుకుతోందనీ, ఓ ప్లాస్టిక్ కవర్ లో ఈ గమ్ వేసుకుని పీల్చుతున్నారని పేర్కొన్నాడు.

డ్రగ్స్ తీసుకున్నాక తమపై దాడి చేస్తున్నారనీ, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారని చెప్పాడు. తమ క్లాస్ లో ఏడు సెక్షన్లు ఉన్నాయనీ, ఒక్కో సెక్షన్ లో 50 మంది ఉన్నారన్నాడు. ఈ విషయమై టీచర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాలుడు వాపోయాడు. కాబట్టి తమకు దయచేసి సాయం చేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ను కోరాడు. అయితే ఏపీలో ఏ జిల్లాలో తాను చదువుతున్నాడో బాలుడు వీడియోలో స్పష్టత ఇవ్వలేదు. కాగా, ఈ వీడియోపై ఏపీ ప్రభుత్వం కూడా ఇంతవరకూ స్పందించలేదు.

More Telugu News