Tirumala: తిరుమలలో ప్రమాద ఘంటికలు... న్యూఢిల్లీ కన్నా పెరిగిన కాలుష్యం!

  • హైదరాబాద్, విజయవాడకన్నా అధిక కాలుష్యం
  • గాలిలో పెరిగిన ఎన్ఓటూ, బెంజీన్
  • ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించకుంటే ప్రమాదం
  • నివేదిక పంపిన కాలుష్య నియంత్రణా మండలి

పచ్చటి పర్వతాలు. స్వచ్ఛమైన గాలి. అడుగు పెడితేనే ఇల వైకుంఠంలోకి వెళ్లిన అనుభూతి. తిరుమల గురించి చెప్పాలంటే ఈ మాటలు చాలవు. ఇదే సమయంలో నిత్యమూ తిరిగే 1500 ఆర్టీసీ బస్సులు. వీటితో పాటు వచ్చిపోతుండే వేలకొద్దీ వాహనాలు. ఇవన్నీ కొండపై ఉన్న ఏడెనిమిది చదరపు కిలోమీటర్ల పరిధిలోనే తిరుగుతూ ఉంటాయి. దీంతో తిరుమలలో కాలుష్యం ఎంతగా పెరిగిందంటే, అది న్యూఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే కాలుష్యం కన్నా అధికం. ఈ విషయం కాలుష్య నియంత్రణ మండలి టీటీడీకి నోటీసులు ఇచ్చిన తరువాతనే వెలుగులోకి వచ్చింది.

తిరుమల ఘాట్ రోడ్లలో, తిరుమలలో సీఏటీఎం (సెంటర్ ఫర్ ఎయిర్ టాక్సిక్ మెటల్స్) మానిటర్స్ ఏర్పాటు చేయగా, ఇవి నమోదు చేసిన డేటా ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. కాలుష్యం ప్రమాదకర స్థాయికి పెరిగిపోయిందని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుంటే, లక్షలాది మందికి తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. వాహనాల నుంచి వచ్చే విషపూరిత నైట్రోజన్ ఆక్సైడ్ వాతావరణంలోని ఓజోన్ తో కలిసి రసాయన చర్య తరువాత పొగగా ఏర్పడుతోందని, మొత్తంగా ఎనిమిది రకాల ప్రమాదకర వాయువులు వెలువడుతున్నాయని తెలిపింది.

కాగా, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో 60 మైక్రోగ్రామ్స్ గా నైట్రోజన్ డయాక్సైడ్ గాఢత ఉండగా, తిరుమలలో ఏకంగా 100 మైక్రోగ్రామ్స్ నైట్రోజన్ డయాక్సైడ్ గాఢత రికార్డవుతోంది. బెంజీన్ విషయానికి వస్తే, హైదరాబాద్ లో 0.76 మైక్రోగ్రామ్స్ ఉండగా, తిరుమలలో 1.60 మైక్రోగ్రామ్స్ గా నమోదైంది.

ఇదిలావుండగా, తిరుమలకు మరిన్ని విద్యుత్ వాహనాలను నడిపించడం ద్వారా మాత్రమే సమస్యను పరిష్కరించవచ్చని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఆర్టీసీ బ్యాటరీ బస్సులను కొండపైకి నడిపిస్తోందని, వీటి సంఖ్యను పెంచి, సాధారణ బస్సులను పూర్తిగా తొలగించాలని సూచిస్తున్నారు. కాలుష్యంపై నివేదికలను పరిశీలించిన తరువాత, పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడిపే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు అంటున్నారు.

More Telugu News