భారత జట్టు ఓటమిపై మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు

01-07-2019 Mon 08:05
  • భారత్‌పై గెలిచిన ఇంగ్లండ్
  • జెర్సీ మారడం వల్లే ఓటమి అన్న మెహబూబా
  • భారత బ్యాటింగ్ ఆసక్తి లేకుండా సాగిందన్న ఒమర్ అబ్దుల్లా
ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారతజట్టు పరాజయంపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబాబా ముఫ్తీ స్పందించారు. భారత జట్టు జెర్సీ రంగు మారడం వల్లే ఓటమి పాలైందని అన్నారు. తనది మూఢనమ్మకమని అనుకున్నా తాను మాత్రం ఇదే చెబుతానని స్పష్టం చేశారు. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని భారత జట్టుకు మోర్గాన్ సేన కళ్లెం వేసింది. ఆదివారం జరిగిన పోరులో 31 పరుగుల తేడాతో భారత్‌పై గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

ఐసీసీ నిబంధనల ప్రకారం తలపడుతున్న ఏ రెండు జట్లు ఒకే రంగు జెర్సీలను ధరించకూడదు. ఇంగ్లండ్-భారత జట్ల జెర్సీలు రెండూ నీలమే కావడంతో భారత్ జట్టు జెర్సీని బీసీసీఐ మార్చింది. కాషాయం-నీలం రంగులతో సరికొత్త జెర్సీని తీసుకొచ్చింది. కాగా, భారత జట్టు ప్రదర్శనపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా పెదవి విరిచారు. భారత బ్యాటింగ్ ఆసక్తి లేకుండా సాగిందన్నారు. మరింత బాగా ఆడి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.