mahaboobnagar: కలెక్టర్‌ పాఠశాల విజిట్‌...సయమానికి రాని 10 మంది ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు

  • మహబూబ్‌నగర్‌లోని గాంధీ రోడ్డు బాలికల పాఠశాలలో ఘటన
  • ఉదయం 9.15 గంటలకు పాఠశాల సందర్శించిన కలెక్టర్‌
  • 16 మంది ఉపాధ్యాయులకు నలుగురే హాజరు

ఆ పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య పదహారు. వీరంతా ఉదయం 9 గంటలకు విధులకు హాజరు కావాలి. కానీ సమయపాలన పాటించింది నలుగురే. సరిగ్గా 9.15 గంటలకు కలెక్టర్‌ పాఠశాల సందర్శించారు. ఉపాధ్యాయులు లేకపోవడం చూసి అవాక్కయ్యారు. రాని వారిలో పది మంది సమయ పాలన పాటించలేదని తెలుసుకుని సస్పెన్షన్‌ వేటుకు ఆదేశాలు జారీ చేశారు.

మహాబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్డులో ఉన్న బాలిక పాఠశాలలో నిన్న ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ ఉదయం 9.15 గంటలకు ఆకస్మికంగా పాఠశాలను తనిఖీ చేశారు. అప్పటికి విద్యార్థులు ప్రార్థనకు సిద్ధమవుతుండగా నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. మొత్తం 16 మంది ఉపాధ్యాయులకు ఇద్దరు సెలవులో ఉండగా మిగిలిన వారు ఇంకా రాలేదని తెలుసుకున్నారు.

తొలుత ఆయన పాఠశాల ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులు, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. పరిశుభ్రత లేకపోవడంతో ఉన్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికి కూడా మిగిలిన ఉపాధ్యాయులు రాకపోవడంతో వారిని సస్పెండ్‌ చేయాల్సిందిగా డీఈఓకు ఆదేశాలు జారీ చేసి వెళ్లిపోయారు. సమయపాలన పాటించని ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశించినట్లు డీఈఓ నాంపల్లి రాజేష్‌ ధ్రువీకరించారు.

More Telugu News